- ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో పసిడి
బెర్లిన్: 17ఏళ్ల అదితీ గోపిచంద్ స్వామి చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తొలి ఆర్చర్‌గా అదితి రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన వ్యక్తిగత కాంపౌండ్ విభాగం ఫైనల్లో అదితి 149-147 పాయింట్ల తేడాతో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాపై సంచలన విజయం సాధించింది. తొలిసారి సీనియర్స్ విభాగం బరిలో దిగిన అదితి.. తొలినుంచి అద్భుత ప్రదర్శనతో రాణించింఇ. సెమీఫైనల్‌లో వెన్నెం జ్యోతి సురేఖను ఓడించి ఫైనల్‌కు చేరింది. అనంతరం మాట్లాడుతూ.. 'గత కొన్నాళ్లుగా పడిన కష్టమంతా నేడు నిజమైందని, చాంపియన్‌గా నిలిచేందుకు దోహదపడిందని' పేర్కొంది.

ఇటీవల జరిగిన ఖేలో ఇండియా గేమ్స్‌లో రాణించి తొలిసారి ప్రపంచ ఆర్చరీ పోటీలకు ఎంపికైంది. అదితికి స్వర్ణ పతకం దక్కడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోటీల్లో ఆమెకు ఇది రెండో గోల్డ్ మెడల్ కావడం విశేషం. శుక్రవారం జ్యోతి సురేఖ వెన్నం, పర్నీత్ కౌర్, అదితీ గోపిచంద్ స్వామిలతో కూడిన మహిళల జట్టు తొలి స్వర్ణ పతకాన్ని ముద్దాడిన సంగతి తెలిసిందే. కాంస్య పతక పోటీలో జ్యోతి సురేఖ ప్లేఆఫ్‌లో నెగ్గి పతకాన్ని ఖాయం చేసుకుంది. దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరింది. ఇందులో రెండు పసిడి, 9 రజిత, మరో రెండు కాంస్య పతకాలు ఉన్నాయి.










