ఒవల్: ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆదుకున్నాడు. 185పరుగులకే 7వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆస్ట్రేలియాను కెప్టెన్ కమ్మిన్స్‌తో కలిసి గాడిలో పెట్టాడు. ఆసీస్ జట్టు రెండోరోజు 85ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 223పరుగులు చేసింది. ఇక జో రూట్ అసాధారణ క్యాచ్‌కు మార్నస్ లబుషేన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట తొలి సేషన్‌లో మార్క్‌వుడ్ వేసిన 43వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. లబుషేన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ మధ్యలోకి దూసుకెళ్లింది. బంతి రాకను గమనించిన జోరూట్ ఎడమవైపు సూపర్ డైవ్‌తో బంతిని సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. జోరూట్ ఫీల్డింగ్ విన్యాసానికి అభిమానులు ఫిదా అయ్యారు. ఓవర్ నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 61పరుగులతో శుక్రవారం ఆటను కొనసాగించిన ఆసీస్‌జట్టులో ఖవాజా(47) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించాడు. బ్రాడ్, వుడ్‌కు రెండేసి, ఆండర్సన్, వోక్స్, రూట్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.










