Jun 12,2023 15:02

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లాలో పాఠశాలలు పున్ణ ప్రారంభం అయిన దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌, డిఆర్‌వోయం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పాఠశాలల్లో సౌకర్యాలు, కోర్టు కేసుల పరిష్కారం, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జిల్లాలో అభివృద్ధి పనులు, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈరోజు సోమవారం నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభించిన దృష్ట్యా ఇంజనీరింగ్‌ అధికారులు విద్యాశాఖ అధికారులు స్పందన కార్యక్రమం అయిన తర్వాత పాఠశాలలను సందర్శించి అక్కడ విద్యార్థులకు కావలసిన మంచినీరు, మరుగుదొడ్లు ఇతర వసతులు ఉన్నాయా లేవా పరిశీలించాలన్నారు. అలాగే నాడు నేడు అభివృద్ధి పనులు పూర్తయ్యాయా లేదా గమనించాలన్నారు. అలాగే జిల్లాలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులకు సంబంధిత అధికారులు కౌంటర్‌ ఫైలు వెంటనే దాఖలు చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత వహించాలని ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈ శుక్రవారం ఉండే అవకాశం ఉన్నందున పెండింగ్లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలన్నారు. జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.