ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజా బాబు మత్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఆక్వా సాగు, నాన్ ఆక్వా సాగు వివరాలు నమోదుకు చేపట్టిన సమగ్ర సర్వే పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌లను గుర్తించుటకు చేపట్టిన సమగ్ర సర్వే పూర్తికావచ్చిందన్నారు. ఈ సర్వేలో ఆక్వా సాగు చేస్తున్న భూముల వివరాలు నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఆక్వా సాగు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిని గుర్తించాలన్నారు. అట్టివారి నుండి రెవిన్యూ పరంగా వార్షిక లీజు వసూలు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.పట్టా భూముల్లో అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేస్తున్న వారిని గుర్తించి, ఆయా ప్రాంతంలో అర్హత మేరకు అనుమతులు పొందేలా, ప్రభుత్వానికి ఫీజులు చెల్లించేలా చూడాలన్నారు.ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడీలు వెంకటేశ్వర రెడ్డి, నాగబాబు, ఆర్ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.










