సినీ ఇండిస్టీలో రాణించడం అంటే అంత సులభం కాదు. చక్కటి అభినయంతో పాటు చక్కని డైలాగ్ డెలివరీ ఉండాలి. అటువంటిది వినబడకపోయినా, ఏమీ మాట్లాడకపోయినా అద్భుతమైన హావభావాలతో నటి అభినయ ప్రేక్షకులకు చేరువయ్యారు. సినిమాలకు పనికిరాదనుకున్న ఆమే.. ప్రత్యేకమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. బాల్యం నుంచి ఆటుపోట్లను ఎదుర్కొని, ఈ స్థాయికు చేరుకున్నారు. మరి ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
కర్ణాటకలోని కడలూర్ జిల్లాకు చెందిన ఆనంద్, హేమలతల కుమార్తె అభినయ. పుట్టుకతోనే ఆమెకు వినికిడి, మాటలు రావని తెలిసి, తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఎలాగైనా తనకి మాటలు, వినికిడి తెప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అభినయ చికిత్స కోసం కుటుంబసభ్యులు అప్పు కూడా చేశారు. అంతేకాదు మూడేళ్ల వయస్సులో ప్రొటీన్ లోపంతో బాధపడినా తను కుంగిపోలేదు. తన బలహీనతలనే ప్లస్‌గా మార్చుకున్నారు. మాట్లాడలేకపోయినా, ఏమీ వినబడకపోయినా ఎదుటివారి పెదాల కదలికను బట్టి, వారు ఏం మాట్లాడుతున్నారో ఇట్టే పసిగట్టే శక్తిని అలవరుచుకున్నారు.
తండ్రి తమిళం, తెలుగు చిత్రాలలో కొన్ని సపోర్టింగ్ రోల్స్‌లో ఆర్టిస్ట్‌గా పనిచేశారు. దాంతో ఆమె చిన్నతనంలో తండ్రితో పాటు సినిమా షూటింగ్స్‌కు వెళుతుండేది. అలా ఆమెకు ఏడేళ్ల వయస్సులో బాలనటిగా ఓ చిత్రంలో నటించింది. దాంతో వాణిజ్య ప్రకటనల్లోనూ అవకాశాలు వచ్చాయి. చికిత్స తీసుకుంటూనే తన లోపాలను అధిగమించి, తల్లిదండ్రుల సహాయంతో పది వరకూ చదివారు. మోడలింగ్ పట్ల ఆసక్తిని కనబరచడంతో ఆమె తండ్రి బాగా ప్రోత్సహించారు. పదిహేడేళ్ల వయస్సులో మలయాళ చిత్రం నాడోడిగల్ (2009)లో నటించే అవకాశం వచ్చింది. ఇది మంచి హిట్ కావడంతో తెలుగు, కన్నడ రీమేక్‌ల్లోనూ తన పాత్రను తానే పోషించారు.

యుక్తవయస్సు నుంచి అభినయకు సంకేత భాష, ఆంగ్ల మాధ్యమంలో చదవడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమెకు ప్రమాదకర ఆపరేషన్ (కాక్లియర్ ఇంప్లాంటేషన్) కూడా జరిగింది. ఆ యంత్రం ఆమెకు వినడానికి సహాయపడేది. ఆమె తన స్క్రిప్ట్ డైలాగ్‌లను ఇంగ్లీషులో రాసి, తన తల్లి సహాయంతో ప్రాక్టీస్ చేసేవారు. సహ కళాకారులు కూడా సహకరిస్తూ ఆమెకు మార్గనిర్దేశం చేసేవారు. దర్శకులు, తల్లిదండ్రుల సమిష్టి కృషి, ఆమె దృఢ సంకల్పంతో చాలా సందర్భాల్లో రీటేక్‌లు లేకుండా నటించారు. ఆమె అభినయం, డ్యాన్స్ నచ్చి వరుస అవకాశాలు రాసాగాయి. షూటింగ్ సమయంలో ఆమెకి మరొకరు డబ్బింగ్ చెప్తున్నప్పటికీ హావభావాలు ప్రదర్శించేవారు. ఇవే ఆమెకు మలయాళం, తమిళం, తెలుగులో అవకాశాలు వచ్చేలా చేశాయి.

తమిళ 'నాడోడిగల్' సినిమాకు అభినయ ఫొటోను చూడగానే డైరెక్టర్ సముద్రఖని ఓకే చేశారు. అయితే ఆమె మూగ, చెవిటి అని తెలియడంతో వద్దని చెప్పి, ముంబై నుంచి ఓ హీరోయిన్‌ను తీసుకొచ్చారు. తీరా ఆమె సెట్‌లో తమిళ భాష రాదంటూ, చేయనని చెప్పేసి, వెళ్లిపోయారు. దీంతో డైరెక్టర్ మాటలురాని అభినయతోనే సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు. ఈ సినిమాకు పదికిపైగా అవార్డులు వచ్చాయి. ఈ సినిమా తెలుగులో 'శంభో శివ శంభో'గా రిలీజైంది. అప్పటి నుంచి ఆమెకు అభినయ భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చేస్తున్నారు. తన కెరీర్‌లో ఉత్తమ సహాయనటిగా పలు అవార్డులు సైతం అందుకున్నారు. ఆమె ఇక్కడితోనే పరిమితం కాకుండా, హాలీవుడ్‌లో 'ఒన్ లిటిల్ ఫింగర్' అనే సినిమా సైతం చేశారు. తనలోని వైకల్యాన్ని అధిగమించి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె మార్క్ ఆంటోని సినిమాలో నటిస్తున్నారు.
పేరు : అభినయ
పుట్టినతేది : నవంబర్ 13, 1991న,
నివాసం : హైదరాబాద్,
అవార్డ్స్ : ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు (తెలుగు)
తెలుగులో నటించినచిత్రాలు: శంభో శివ శంభో, నేనింతే, దమ్ము, ధనలక్ష్మి తలపు తడితే, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్లు, సీతారామం.










