Aug 13,2023 15:58

బ్రూస్‌లీ అంటే చెప్పలేనంత అభిమానం. అతన్ని చూసి మార్షల్‌ ఆర్ట్స్‌, నటనపై మక్కువ పెంచుకున్నాడు. ఆ మక్కువే అతన్ని ఉత్తరాఖండ్‌ నుంచి చైనా వెళ్లేలా చేసింది.. అక్కడి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, స్టార్‌ హీరో కాగలిగాడు. అతనే దేవ్‌ రథూడీ. దేవ్‌ కష్టాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం ఆయన జీవనాన్ని 'దేవ్‌ లాంగ్‌ స్ట్రగుల్‌' అనే పేరుతో ఏడో తరగతి ఇంగ్లీష్‌ పాఠ్యాంశంగా ప్రచురించింది.

4
ఉత్తరాఖండ్‌ తెహ్రీ గడ్వాల్‌ జిల్లా, కెమ్రియా సౌర్‌ అనే గ్రామంలో ఓ రైతు కుటుంబంలో 1976లో జన్మించాడు దేవ్‌ రథూడీ. దేవ్‌కు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి సహకరించేందుకు 1993లో 10వ తరగతి పూర్తికాగానే ఉద్యోగం వెతుక్కుంటూ న్యూఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ డబ్బు సంపాదించడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, ఆ సొమ్మును కుటుంబసభ్యులకు పంపించేవాడు. ఢిల్లీలో ఉంటూనే బ్రూస్‌లీ సినిమాలను చూసి, సినిమా ప్రపంచంలో తన అదష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై చేరుకున్నాడు. 1998లో ముంబై ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు కానీ అతనికి ఒక్క అవకాశమూ దక్కలేదు.
మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలన్న తన కోరిక రాత్రిళ్లు నిద్రపట్టనిచ్చేది కాదట. ఉత్తరాఖండ్‌లో ఉండగానే కరాటే అభ్యసించాడు. తదుపరి ట్రైనింగ్‌ కోసం చైనాలోని షావోలిన్‌ టెంపుల్‌కు వెళ్లాలని తెలుసుకున్నాడు. 2005లో దేవ్‌ చైనా చేరుకున్నాడు. కానీ శిక్షణ పొందేందుకు స్తోమత లేక ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేరాడు. పగటిపూట వెయిటర్‌గా పనిచేస్తూ రాత్రిళ్లు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాడు. రెండేళ్లు వెయిటర్‌గా చేస్తూ చైనీస్‌ భాషను నేర్చుకున్నాడు. దాంతో వెయిటర్‌ నుంచి మేనేజర్‌గా ఎదగాడు. కొన్నాళ్లకు షియాన్‌ సిటీలో 'రెడ్‌ఫోర్ట్‌' పేరుతో స్వంతంగా రెస్టారెంట్‌ ప్రారంభించాడు.

3


రెస్టారెంట్‌కు వచ్చిన ఓ చైనీస్‌ డైరెక్టర్‌ దేవ్‌తో సంభాషిస్తూ ఆయన ఆలోచన గ్రహించి, నటించే అవకాశమిచ్చాడు. అలా 2017లో తొలిసారిగా 'స్వాట్‌' అనే టీవీ సిరీస్‌లో నటించాడు. ఆ సిరీస్‌ పెద్ద హిట్‌ అవ్వడమే కాక దేవ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అతనికి సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. దేవ్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. చైనీస్‌ సినిమాలో స్టార్‌గా గుర్తింపు పొందాడు. దేవ్‌ ఇప్పటివరకు 35 చైనీస్‌ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించాడు. 2011లో అంజలి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. ప్రస్తుతం చైనాలో ఎనిమిది రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. స్వగ్రామం నుంచి 150 మందిని చైనాకు తీసుకెళ్లి, తన రెస్టారెంట్లలో ఉద్యోగాలిచ్చాడు.
చైనా వెళ్లిన 18 ఏళ్ల తర్వాత షాంగ్జీ ప్రావీన్స్‌ దేవ్‌ కష్టాన్ని గుర్తించింది. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏడవ తరగతి ఇంగ్లీషు పాఠ్యపుస్తకంలో 'దేవ్‌ లాంగ్‌ స్ట్రగుల్‌' అనే పేరుతో ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. 'చైనీస్‌ సినిమా నా నటనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాక కోవిడ్‌-19 సమయంలో చైనీయులు నాపై ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ తమలో ఒకరిగా భావించి సహాయం చేశారని' దేవ్‌ అంటున్నాడు.

4