Aug 04,2023 09:11

న్యూఢిల్లీ : జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేసేందుకు అలహాబాద్‌ హైకోర్టు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ)ను అనుమతించింది. దీంతో శుక్రవారం తెల్లవారు జామున సర్వేకు ఏఎస్‌ఐ సన్నాహాలు చేసుకుంది. మరోవైపు దీనికి వ్యతిరేకంగా ముస్లిం పెద్దలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మసీదు ప్రాంగణం లోపల ప్రార్థనలు చేసుకునే హక్కును కోరుతూ హిందూ న్యాయవాదుల బృందం వేసిన పిటిషన్‌పై గతనెల 21న వారణాసి జిల్లా కోర్టు మొదట సర్వేను ఆదేశించింది. అయితే, సర్వేకు వ్యతిరేకంగా మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించేందుకు.. గతనెల 24న సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది.అయితే గురువారం అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రిటింకర్‌ దివాకర్‌ మసీదు కమిటీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వే కోసం వారణాసి కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా శాస్త్రీయ సర్వే అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసులో ఇరు పక్షాలు తమ సాక్ష్యాలను సమర్పించిన తర్వాత తదుపరి దశలో మాత్రమే ఇటువంటి సర్వేలను అనుమతించాలని మసీదు ప్యానెల్‌ హైకోర్టు ముందు వాదించింది. తవ్వకం పనులు మసీదు నిర్మాణ సమగ్రతను దెబ్బతీస్తాయని కూడా వివరించింది.