- ద్వితీయస్థానంలో రాజస్థాన్
- తృతీయస్థానంలో తెలంగాణ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో మన రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. 20 సూత్రాల అమలు కార్యక్రమం, 2022-23 ఆర్థిక సంవత్సర ఫలితాల నివేదికను కేంద్రం విడుదల చేసిందని, దీనిలో ఎపి తొలిస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 24,852 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 1,24,311 కనెక్షన్లను రైతులకు మంజూరు చేశామని వివరించారు. దేశ వ్యాప్తంగా 4,54,081 వ్యవసా పంపుసెట్లను విద్యుదీకరించాలని లక్ష్యం నిర్దేశించుకోగా 7,35,338 కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారని, అందులో 1.24 లక్షలు ఎపిలోనే కావడం విశేషమని తెలిపారు. రాజస్థాన్ 44,770 కనెక్షన్లు టార్గెట్ పెట్టుకోగా 99,137 కనెక్షన్లు మంజూరు చేసి ద్వితీయస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం 25,148కిగాను 89,183 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారని తెలిపారు. పంజాబ్ 524 కనెక్షన్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు., పాండిచ్చేది 45 కనెక్షన్లు ఇచ్చి చివరిస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ వల్లే ఇది సాధ్యమైందని విజయానంద్ వివరించారు.










