ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయిజిల్లా) : మహిళాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంజీఎం మైదానంలో హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా మెప్మా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడవ విడత ఆసరా నిధులకు సంబంధించి మెగా చెక్కును మెప్మా మహిళలకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మునిసిపల్ చైర్ పర్సన్ డిఎన్ ఇంద్రజ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఇతర ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రజలను అభివృద్ధి చేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో పారదర్శకంగా నేరుగా వారి అకౌంట్లోకి నగదును బదిలీ చేస్తుంటే చూసి ఓర్చు కోలేని వారు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటూ కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టడమే కాకుండా ప్రజలను సోమరాపోతులను చేస్తున్నారని ప్రజలను అవహేళన చేస్తూన్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మరో సారి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా మహిళలు 'మందుకు రావాలన్నారు. ఇదే సందర్భంగా పురపాలక సంఘ వ్యాప్తంగా రిసోర్స్ పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళలందరికీ తెలుగు తల్లి పట్టణ సమైక్య అధ్యక్షురాలు మల్లికా బాను ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందించారు. అనంతరం మెగా చెక్కును మహిళలకు అందజేసి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు చిన్నారులు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని, వైసిపి మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ జబివుల్లా, వార్డు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, మెప్మా అధికారులు, సిఓలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.










