పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు రిజిస్ట్రేషన్లు ఉచితం
మంత్రివర్గ నిర్ణయాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 21వ తేది నుండి ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్దిక, సామాజిక, విద్య, జీవనోపాధి , జన సమతుల్యత అనే అంశాలపై వివరాలు సేకరించడం ఆర్ధిక ,సామాజిక అభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుందని మంత్రి మండలి అభిప్రాయపడింది. దీనికి సంబంధించి జిల్లాల్లో వివిధ కుల సంఘాలతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది,
సమావేశానంతరం మంత్రి మండలి నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
సచివాలయంలో మీడియాకు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం, వేలూరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు . రాజమహేంద్రవరం జిల్లాలోని దేవీ పట్నం, కూనవరం, వర రామచంద్రాపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించిన రిజిస్ట్రేషను కూడా ఉచితంగానే చేయనున్నట్లు తెలిపారు. విశాఖపట్టణం జిల్లాలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, యూజర్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రి మండలి గ్రీన్ సిగల్ ఇచ్చినట్లు చెప్పారు. ఈనెల 15న భూమిలేని పేదలకు భూ పంపిణీ, లంక భూములకు యాజమాన్యపు హక్కులు, ఇనామ్ భూములు, దళితులకు సంబంధించి శ్మశానవాటికలకు స్థలాల కేటాయింపుకు సంబంధించి భూ పట్టాలు పంపిణీ చేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించినట్లు తెలిపారు.
- పరిశ్రమల భూకేటాయింపుల్లో మార్పులు
. పరిశ్రమలకు భూ కేటాయింపుల విధానంలో మార్పునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలకు మరింత అనుకూలత కోసం లీజు విధానం స్ధానే సేల్ డీడ్ విధానంలో కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. పరిశ్రమలకోసం మాత్రమే ఆ భూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ రూపకల్పన, న్యూ ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీకి ఆమోదముద్ర వేసింది. 50 ఎకరాల లోపు ఎపిఐఐసి కేటాయించిన 285 భూ కేటాయింపులకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్రముఖ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. 2023-24 ఖరీఫ్ ధాన్యం సేకరణకు మార్క్‌ఫెడ్ కు రూ. 5వేలకోట్ల రుణ మంజూరు, ప్రభుత్వ గ్యారెంటీకి కూడా ఆమోద ముద్ర వేసింది ధాన్యం సేకరణ సివిల్ స ప్లైస్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంల చేయనున్నారు.
- జోనల్ వ్యవస్థలో మార్పులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64శాతం డిఎ (01.07.2022నుంచి) ఇవ్వాలన్న ఆర్దికశాఖ నిర్ణయాన్ని క్యాబినెట్ రాటిఫై చేసింది. ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లోకల్ క్యాడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రాప్ట్ ఆర్డర్ 2023ను, జోనల్ వ్యవస్ధలో మార్పులకు కూడా మంత్రి మండలి ఆమోదంతెలిపింది, ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను ఆరు జోన్లకు మార్చడంతో పాటు రెండు మల్టీజోన్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మార్కాపురం మెడికల్ కాలేజీలో 21 పోస్టులు నెఫ్రాలజీ డిపార్టుమెంట్ ఏర్పాటుతో పాటు పలాస తరహాలో కిడ్నీ వ్యాధితో బాదపడుతున్న వారి కోసం కిడ్నీ పరిశోదనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
- విద్యుత్తు డ్యూటీల్లో మినహాయింపులు:
ఎపి ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞపి మేరకు వివిధ రకాల విద్యుత్తు డ్యూటీల్లో మినహాయింపులు కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఫెర్రో అల్లాయిస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి కొంత మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.
- సంక్రాంతికి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు:
రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీకి క్యాబినెట్ గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ఒక్కో జర్నలిస్టుకు మూడు సెంట్లు ఇవ్వాలనే ప్రతిపాదనకు కూడా మంత్రి మంత్రి మండలి అంగీకారం తెలిపింది. ఈ ప్రకియలో జర్నలిస్టులను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం:
భారీ ప్రాజెక్ట్‌లకు వివిధ రకాల రాయితీలను కల్పిస్తూ ఈ నెల 30న సిఎం అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్‌ఐపిబి నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
- భూ కేటాయింపులు
. కర్నూలుజిల్లా ఓర్వకల్లులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 4.12 ఎకరాలు
.ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఎపిఐఐసికి 2.92 ఎకరాలు
.శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు.
.నెల్లూరు జిల్లా రావూరులో 39.08 ఎకరాల భూమిని రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణం కోసం ఎపి మారిటైమ్ బోర్డుకు కేటాయింపు.
. విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపదకళాకారుడు వంగపండు ప్రసాదరావు సతీమణి వంగపండు విజయలక్ష్మీకి వెయ్యి గజాల ఇంటి స్థలం కేటాయింపు.
. కర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్శిటీ, స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు మరో వంద ఎకరాలు










