ప్రజాశక్తి-హిందూపురం:శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో రెండో రోజు శనివారం ఎసిబి అధికారుల సోదాలు కొనసాగాయి. పట్టణ వాసులు భవన నిర్మాణాల అనుమతుల కోసం చేసిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎసిబి సిఐ మోహన్‌ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలోని మారుతీ నగర్, చౌడేశ్వరి కాలనీ, నానేప్ప నగర్, టీచర్స్ కాలనీల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు మంజూరు చేసిన భవనాలను పరిశీలన చేశామని తెలిపారు. మూడు భవనాలు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించామన్నారు. నిబంధలనకు విరుద్ధంగా నిర్మాణం చేసిన నిర్మాణదారులకు టౌన్‌ప్లానింగ్ అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకుండా వదిలేశారని తెలిపారు. రికార్డుల నిర్వహణ పూర్తి స్థాయిలో లేదన్నారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఎసిపి) కార్యాలయానికి వచ్చి సంతకాలు చేసి విధులకు గైర్హాజరైనట్లు గుర్తించినట్లు చెప్పారు. హిందూపురం టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై సమగ్రంగా నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. అయితే, రెండో రోజూ మున్సిపల్ కార్యాలయంలోని ఆయా విభాగాల సెక్షన్ అధికారులు విధులు హాజరు కాకపోవడం గమనార్హం.










