ప్రజాశక్తి- ఒంగోలుబ్యూరో:ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో వివిధ చోట్లా జరుగుతున్న భూ కుంభకోణాలలో బాధితులకు న్యాయం చేసేందుకు సిట్టింగు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ స్టాంపులతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆస్తులను కాజేస్తున్నారన్నారు. ఒంగోలు, కనిగిరి, మార్కాపురం పట్టణాల్లో ఇలాంటి కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇవి జరుగుతున్న తీరు చూస్తే, తెల్గీ కుంభకోణంలా ఉందని పేర్కొన్నారు. సామాన్యుల, మధ్యతరగతి ప్రజల, విదేశాల్లో ఉన్న వారి, అద్దెకు ఇళ్లు ఇచ్చిన వారి ఆస్తులకు నకిలీ పత్రాలతో ఎసరు పెడుతున్నారన్నారు. అక్రమ పత్రాలతో ఆస్తులను కొల్లగొడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే ఈ సంఘటనలు సంచలనం కలిగిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేలు కూడా అక్రమ రిజిస్ట్రేషన్లను ప్రోత్సహిస్తూ పంచాయితీలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల భూములను వివిధ పరిశ్రమల పేరుతో పలువురు తీసుకుని వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకుంటూ వాటిని కూడా అమ్ముకుంటున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ పనితీరు ఆందోళనకరంగా మారిందన్నారు. అన్ని రకాల పత్రాలూ సక్రమంగా ఉన్నాయో? లేదో? చూడకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని విమర్శించారు. అవి సక్రమంగా లేకుంటే కోర్టులకు వెళ్లాలని సూచించడం కూడా విడ్డూరంగా ఉందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోన్నా, ఇలాంటి పద్ధతుల్లో రిజిస్ట్రేషన్లు సాగడం ఏమిటని ప్రశ్నించారు. బైజూస్‌కు వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెబుతున్నారని, టోఫెల్ శిక్షణ పేరుతో కేటాయింపులు చేస్తున్నారని, ఇవన్నీ కార్పొరేట్ సంస్థల బాగోగుల కోసమేనా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటితోపాటు మద్యం ఇసుకలో వేల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. వాటిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు కొందరి జేబుల్లోకిపోతుంటే జనంపై వివిధ పన్నుల రూపంలో భారాలు మోపుతున్నారన్నారు. మద్యం అక్రమాలపై విచారణ జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి కేంద్ర హోం మంత్రిని కలిసి కోరారన్నారు. ఇప్పటికీ విచారణ లేకపోగా, ఆమె కూడా మౌనంగా ఉన్నారని తెలిపారు. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ వ్యవహారంలో భాగస్వాములయ్యారా? లేక రాష్ట్రం చేసే పనులకు కేంద్రం వత్తాసు పలుకుతోందా? అని ప్రశ్నించారు. ఈ కుంభకోణాల్లో బిజెపి పాత్ర కూడా ఉందన్నారు. వేలాది ఎకరాలు అదానీకి ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని అదానీ కలిసినా రహస్యంగా ఉంచుతారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని శిథిలావస్థకు చేర్చుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అక్రమ భూ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. తాగునీటికి కేటాయించిన ఐదు టిఎంసిలు చాలేలా లేవని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి శ్రేణులు చేస్తోన్న నిరసనలపై పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పూనాటి ఆంజనేయులు, జివి.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు.










