Aug 29,2023 05:00
  • కేంద్ర ప్రభుత్వ కసరత్తు!
  • యాజమాన్యంతో చర్చలు
  • ఎన్‌ఎండిసి కొనుగోలు చేస్తేనే ప్లాంట్‌కు మేలు : కార్మిక సంఘాలు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : స్టీల్‌ప్లాంటుకు చెందిన వెయ్యి ఎకరాల భూమిని అదానికి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ దిశలో ఉన్నతస్థాయి నుండి స్టీల్‌ప్లాంటు యాజమాన్యానికి సంకేతాలు అందినట్లు సమాచారం. యాజమాన్యం కూడా ఈ మేరకు చర్యలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయంలో స్టీల్‌ప్లాంట్‌లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ లేక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో పడిన స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా ప్లాంటు భూములను అదానికి అప్పోగించడానికి ఒత్తిడి తీసుకువస్తుండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ప్రయత్నాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రంలోని మోడీ సర్కారు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించేందుకు శతవిధాలా చేస్తోన్న ప్రయత్నాలను 928 రోజులుగా విశాఖ కార్మికవర్గం పోరాటాలతో తిప్పికొడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే ప్లాంట్‌లోని మూడు ఫర్నేస్‌లలో ఒకదాన్ని పూర్తిగా నిలిపేసి ఉత్పత్తిని దెబ్బతీసింది. మరోవైపు ఉక్కు కర్మాగారానికి రావాల్సిన కోకింగ్‌ కోల్‌, రా మెటీరియల్‌ను అన్‌లోడింగ్‌ చేయనీయకుండా గంగవరం పోర్టు యజమాని అదానీ ద్వారా కుట్ర చేసింది. దీంతో, గడిచిన రెండు నెలలుగా ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్‌ అందక ప్లాంట్‌ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే..

గంగవరం పోర్టు గెస్ట్‌ హౌస్‌ వద్ద ఈ వెయ్యి ఎకరాల భూమిని అదానీ కోరుతున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ.15 వేల కోట్లు ఉండగా, అదానీకి రూ.100 కోట్లకు ఇచ్చే ప్రణాళిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నడుస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే 1,400 ఎకరాలను స్టీల్‌ప్లాంట్‌ నుంచి అదానీ తీసుకున్నారు. ఈ మూల్యం ఇప్పటికీ విశాఖ కార్మికవర్గం చెల్లిస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే గంగవరం పోర్టులో తన 10.6 శాతం వాటాను వదిలేసి అదానీకి వంద శాతం పోర్టు దక్కేలా చేసింది. అదానీ పోర్టు కార్మిక చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి కనీస వేతనాలను సైతం అమలు చేయకపోవడంతో నెలన్నర రోజులుగా పోర్టు నిర్వాసితులు, కార్మిక కుటుంబాలు ఆందోళనలు చేపడుతున్నాయి. మరోవైపు పోర్టుకు కార్గో హేండ్లింగ్‌ ఛార్జీలు బకాయి ఉందన్న కారణంతో స్టీల్‌ప్లాంట్‌కు అదానీ గంగవరం పోర్టు నుండి ముడిసరుకును నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయినా తాజాగా వెయ్యి ఎకరాల భూమిని అదానికి అప్పచెప్పడానికి లోపాయికారీగా చర్చలు జరుగుతుండటం కార్మికులను కలవరపెడుతోంది.

ప్లాంట్‌లో భూములపై కదలికలు ఇలా..

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1,160 ఎకరాల లీజు కోసం ఇటీవల ఎన్‌ఎండిసి ఉన్నతాధికారుల బృందం ప్లాంట్‌లో పర్యటించింది. దాదాపు ఈ వెంచర్‌ క్లియర్‌ అయ్యే దిశలో ఉంది. ఎన్‌ఎండిసి ఈ భూములను తీసుకుంటే రూ.1,500 కోట్ల మేర ప్లాంట్‌కు వర్కింగ్‌ కేపిటల్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. కార్మిక సంఘాలు కూడా దీన్ని మంచి పరిణామంగానే భావిస్తున్నాయి. ఎన్‌ఎండిసి-ఆర్‌ఐఎన్‌ఎల్‌తో ఈ చర్చలు సఫలీకృతం కావాలని కార్మికవర్గం కోరుకుంటోంది. స్టీల్‌ప్లాంట్‌లో దీనికి సంబంధించిన స్థల పరిశీలన కూడా దాదాపు పూర్తయింది. ఎన్‌ఎండిసి ప్రభుత్వ రంగ సంస్థ అయినందున కార్మికవర్గం ఈ తాజా వ్యవహారాన్ని స్వాగతిస్తోంది. అదానీకి వెయ్యి ఎకరాలు ఇస్తే సహించేదిలేదని హెచ్చరిస్తోంది. తాజాగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం వివరణ ఇవ్వాలని కార్మికవర్గం డిమాండ్‌ చేస్తోంది.