తిరువనంతపురం : సిఐటియు కేరళ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షులు, సిపిఎం సీనియర్ నాయకులు అనంతలవట్టమ్ ఆనందన్‌కు కుటుంబ సభ్యులు, కార్యకర్తల అశ్రు నివాళి మధ్య శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. 86 ఏళ్ల ఆనందన్ క్యాన్సర్‌తో బాధపడుతూ తిరువనంతపురంలోని ఒక ఆసుపత్రిలో గురువారం కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని సిఐటియు రాష్ట్ర కార్యాలయం నుంచి శాంతికవాడ వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం అధికార లాంచనాలతో శాంతికవాడలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్, మంత్రులు, నాయకులు పాల్గన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎకెజి సెంటర్‌కు చేరుకుని ఆనందన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ప్రియతమ నేతకు అంతిమ నివాళులు అర్పించేందుకు రాజకీయ నేతలతోపాటు పలువురు నేతలు తరలివచ్చారు.
శ్రమజీవులు, పేదల కోసం చివరివరకూ పరితపించిన ఆనందన్
ఆనందన్ ఎల్లవేళలా శ్రామికవర్గం, అణగారిన ప్రజల కోసం నిబద్ధతతో పనిచేశారు. సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులుగాను, రాష్ట్ర కమిటీ సభ్యులుగానూ పనిచేశారు. ఈ పదవుల నుంచి కొచ్చిలో జరిగిన గత రాష్ట్ర మహాసభలో వైదొలిగారు. అట్టింగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1987, 1996, 2001ల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళలోని వివిధ జిల్లాల కార్మికులు ప్రత్యేకంగా కాయిర్ (కొబ్బరి పీచు) కార్మికుల పోరాటాలకు నేతృత్వం వహించారు.
సిఐటియు ఘననివాళి
అనంతలవట్టమ్ ఆనందన్‌కు సిఐటియు ఘనంగా నివాళులర్పించింది. ఆనందన్ తన ఏడు దశాబ్దాల ప్రజా జీవితంలో అనేక కష్టాలను, ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొన్నారని, అనేక సందర్భరాల్లో అరెస్టయ్యారని, నిరసనల్లో పోలీసుల లాఠీఛార్జితో గాయాల పాలయ్యారని తెలిపింది. అంకిత భావం కలిగిన ప్రజానేతను కోల్పోవడం సిఐటియుకు తీరని లోటుగా పేర్కొంది. ఆనందన్‌కు నివాళి అర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు సిఐటియు ప్రగాఢ సానుభూతి తెలిపింది.










