- అధికార లాంఛనాలతో చెన్నైలో అంత్యక్రియలు..
- హాజరైన పలువురు ప్రముఖులు
చెన్నై : హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (98)కు వేలాది మంది అభిమానుల మధ్య శనివారం చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రేటర్ చెన్నై సిటీ పోలీసుల ఆర్మ్‌డ్ రిజర్వ్ యూనిట్‌కు చెందిన పోలీసు బృందం కొద్దిసేపు మౌనం పాటించి, గౌరవ సూచకంగా తుపాకీ వందనం చేసింది. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖుల సమక్షంలో దహన సంస్కారాలు నిర్వహించారు. చెన్నైలోని తేనాంపేటలోని ఆయన నివాసాన్ని పలువురు ప్రముఖులు, అభిమానులు సందర్శించి, ఆ మహనీయునికి నివాళులర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ప్రతిపక్ష నేత పళనిస్వామి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ విద్యుత్ శాఖ మంత్రి కె. కృష్ణన్‌కుట్టి, సిపిఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి జి. బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.










