Aug 27,2023 09:07

ట్రాన్స్‌జెండర్‌ల వ్యవహార శైలి పలు సినిమాల్లో చూపించారు. అయినా వారంటే సమాజంలో చాలా చిన్నచూపు. తనకోసమే కాకుండా తనలాంటి వారందరి కోసం కృషి చేసిన శ్రీగౌరి సావంత్‌ అందరికీ విదితమే. ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం న్యాయ పోరాటం చేసిన ఆమె జీవితాధారంగా దర్శకుడు రవి జాదవ్‌ తెరకెక్కించిన సిరీస్‌ 'తాలీ'. బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ ప్రధానపాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ 'జియో సినిమా'లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్స్‌గా సినిమాను చూపించారు. ఇటువంటి వ్యక్తుల బయోపిక్స్‌ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కలిగిస్తాయి. అసలు ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఇందులో ఏయే అంశాలు ప్రస్తావించారో తెలుసుకుందాం.
కథలోకి వెళితే.. గణేశ్‌ (కృతిక) ఓ పోలీసు అధికారి తనయుడు. బాల్యంలోనే అమ్మాయిగా మారాలని కోరుకుంటాడు. 'పెద్దయ్యాక ఏమవుతావ్‌?' అని టీచర్‌ ప్రశ్నిస్తే అమ్మను అవుతానని సమాధానం చెప్పి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాడు. గణేశ్‌ ప్రవర్తన కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది. కొన్ని నెలలకు అతడి తల్లి మరణిస్తుంది. 'నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుంటే ఈ ఇంట్లో ఉండు.. లేదంటే వెళ్లిపో' అని గణేశ్‌ తండ్రి కొడుక్కి తేల్చి చెబుతాడు. తండ్రి మాట కాదని గణేశ్‌ 15 ఏళ్ల వయసులో పుణె నుంచి ముంబయికి వెళ్తాడు. సర్జరీ ద్వారా మహిళగా మారి.. గౌరి (సుస్మితాసేన్‌) అని పేరు పెట్టుకుంటాడు. గౌరి తాను కోరుకున్నట్లు అమ్మగా ఎలా మారింది? దేశంలో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు తెచ్చే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? అనేదే అసలు కథ.

A-story-of-transgender-identity


నిజంగా బయోపిక్స్‌ తీయాలంటే దర్శకులకు ఓ సవాల్‌. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. కల్పితానికి వెసులుబాటు ఉండదు. వాస్తవానికి దగ్గరగా తెరకెక్కించాలి. అప్పటికే చాలామందికి తెలిసిన కథ కావడంతో స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు రవి జాదవ్‌, క్షితిజ్‌ పట్వర్థన్‌ చాలా కష్టపడ్డారు. ట్రాన్స్‌జెండర్‌ మనోభావాల్ని తెరపైకి తీసుకొచ్చి, ప్రేక్షకుల్ని ఆలోచింపజేయడంలో విజయం సాధించారు.
గౌరి పాత్ర తన కథ గురించి చెప్పే సన్నివేశంతో ప్రారంభమవుతుందీ సిరీస్‌. ఆరు ఎపిసోడ్లలో సాగుతుంది. గణేశ్‌ బాల్యం, కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూనే దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లారు. పురుషులు, మహిళలతో సమానంగా ట్రాన్స్‌జెండర్లకూ హక్కులుండాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన గౌరి గెలుస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ రేకెత్తించారు. ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసే క్రమంలో మళ్లీ.. గౌరి 'ఫ్లాష్‌బ్యాక్‌' తెరపైకి వస్తుంది. కోర్టు నేపథ్యంలో ప్రస్తుతాన్ని, ఇంటర్వ్యూ నేపథ్యంలో గతాన్ని చూపించిన తీరు బాగుంది. ట్రాన్స్‌జెండర్లను అవమానించే వారికి గౌరి బుద్ధి చెప్పడం.. అనాథ పిల్లలను చేరదీయడం.. అమెరికాలోని ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీ కాలేజ్‌లో ప్రసంగించేందుకు వెళ్లడం.. ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో చూపించారు. 5, 6వ ఎపిసోడ్లలో కథ వేగంగా ఉంటుంది. గణేశ్‌.. గౌరిగా మారాననే ఆనందంలో ఉండగా.. కొడుకు చనిపోయాడంటూ తండ్రి పిండం పెట్టడం భావోద్వేగానికి గురిచేస్తుంది. 'నేను చప్పట్లు కొట్టను. కొట్టించుకుంటాను' లాంటి సంభాషణలు గౌరి లక్ష్యాన్ని సుస్పష్టం చేస్తాయి. మగ, ఆడ, ట్రాన్స్‌జెండర్‌.. ఇలా లింగం ఏదైనా అబివృద్ధి పథంలో నడుస్తుంటే శత్రువులు ఏర్పడతారనే విషయాన్నీ ప్రస్తవించారు. క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్‌ ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తుంది.

A-story-of-transgender-identity


సుస్మితాసేన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుభవం ఉన్న నటి. కానీ, ఇలాంటి పాత్రను అంగీకరించడం.. అందులో ఒదిగిపోవడం సాహసమే. గణేశ్‌గా కృతిక డియో, తండ్రిగా నందు యాదవ్‌, ఇతర పాత్రధారులు చక్కగా నటించారు. విజువల్స్‌ బాగున్నాయి. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగుంది.

నటీనటులు : సుస్మితా సేన్‌,
కృతిక డియో,
ఐశ్వర్య నర్కర్‌,
అంకుర్‌ భాటియా,
నందు మాధవ్‌ తదితరులు.
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ : క్షితిజ్‌ పట్వర్థన్‌,
దర్శకుడు : రవి జాదవ్‌,
నిర్మాత : అర్జున్‌సింగ్‌ బరన్‌, కార్తీక్‌ డీ నిషాందర్‌, సులేమాన్‌ నదియావాలా
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ : జియో సినిమా