Nov 04,2023 21:58

- ఎఐఎఫ్‌ఎఫ్‌ డబ్ల్యుఎఫ్‌ వర్క్‌ షాప్‌లో జాతీయ నేతల డిమాండ్‌
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:దేశంలో వ్యవసాయం తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న మత్స్య రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని సిఐటియు ఆలిండియా అధ్యక్షులు, అఖిల భారత మత్స్యకారులు, మత్స్య కార్మిక సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌) ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు కె.హేమలత డిమాండ్‌ చేశారు. కాకినాడ యుటిఎఫ్‌ హోమ్‌లో జరుగుతున్న ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యుఎఫ్‌ జాతీయ వర్క్‌షాప్‌ రెండో రోజు శనివారం కొనసాగింది. దేశవ్యాప్తంగా ఫెడరేషన్‌ నిర్మాణంపై ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్ర కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పూర్తి కాల బాధ్యులను ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అఖిల భారత స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, తదితర అంశాలపై గ్రూపు చర్చలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హేమలత, ఫెడరేషన్‌ జాతీయ కోశాధికారి జి.మమత మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మత్స్య పరిశ్రమపై ప్రత్యక్షంగా మూడు కోట్లు, పరోక్షంగా మరో నాలుగు కోట్ల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో ఉపాధి కల్పిస్తోన్న రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయమన్నారు. ఎగుమతుల ద్వారా రూ.లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని మత్స్యరంగం కల్పిస్తోందని తెలిపారు. మత్స్యరంగం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని దేశవ్యాప్తంగా భవిష్యత్తులో ఉధృత పోరాటాలు చేసే విధంగా సెమినార్‌లో దిశానిర్దేశం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య జాతీయ అధ్యక్షులు దేబాశిష్‌ బర్మన్‌, ప్రధాన కార్యదర్శి పులివిల్లై స్టాన్లీ, మాజీ మంత్రి, ఫెడరేషన్‌ త్రిపుర రాష్ట్ర అధ్యక్షులు సుదాన్‌ దాస్‌, జాతీయ కార్యదర్శి ఉమా సర్కార్‌, కేరళ ప్రతినిధి బషీర్‌, ఒడిశా నుంచి ఉల్లాస్‌, మహారాష్ట్ర నుంచి సందీప్‌ పాటిల్‌, బీహార్‌ నుంచి రామ్‌ బాలక్‌, ఎపి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కర్రి చంద్రశేఖర్‌, కొల్లాటి శ్రీనివాసరావు, జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యులు చెక్క రమణి తదితరులు పాల్గొన్నారు.