ఆకాశం ఒక అద్భుతం. అందులో జరిగే వింతలు అనంతం. ఆరుబయట పడుకునే అవకాశం ఉండి మామూలుగా ఆకాశాన్ని గమనిస్తుంటేనే కదిలే మేఘాలు రకరకాల ఆకారాలతో కనువిందు చేస్తాయి. చుక్కల అమరిక చిన్న వారి నుండి పెద్దల వరకూ ఎవరి ఇష్టానుసారం వారు కలుపుతూ ఆనందించేలా ఉంటుంది. మధ్య మధ్యలో ఉల్క భూమివైపు రాలినట్లు చూస్తూ ఉంటాం. మరి నిరంతరం ప్రయోగాల్లో మునిగితేలే సైంటిస్టులకు ఇంకెన్ని అద్భుతాలు చూసే అవకాశం ఉంటుందో కదా..! అలాంటి అద్భుతాన్నే మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాపితంగా గ్రహాల సమలేఖనాన్ని చూసే అవకాశం ఉంది. తప్పకుండా చూడండి అని సూచించారు శాస్త్రవేత్తలు. ఆ వింత ఎలా జరిగిందో.. దాని వివరాలేమిటో.. తెలుసుకుందాం.
నాసా శాస్త్రవేత్తలు, ఉల్క పర్యావరణ కార్యాలయంలోని ప్రధాన అధికారి బిల్ కుక్ 2023 మార్చి 28, మంగళవారం గ్రహాల అమరిక 'చాలా అందంగా' ఉంటుందని ప్రకటించారు. ఆకాశంలో ఐదు గ్రహాలు.. మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ ఒకే వరుసలో కనిపిస్తాయంటున్నారు. 27, 28 తేదీలలో శనిగ్రహం కూడా చాలా తక్కువ సమయం కనిపించి అదృశ్యమౌతుంది. గొప్ప విషయం ఏమిటంటే వీనస్, మార్స్, బృహస్పతి బైనాక్యులర్ లేకుండానే కనిపిస్తాయి. మెర్క్యురీ, యురేనస్‌లను మాత్రం బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ సహాయంతోనే చూడగలమని తెలిపారు.

- ఎప్పుడు, ఎక్కడ..?
భారత కాలమానం ప్రకారం సూర్యాస్తమయం అయిన వెంటనే అంటే, సాయంత్రం 6:36 ని. నుండి 7:15 ని. లోపల పశ్చిమదిశ వైపు ఈ గ్రహాలు దాదాపు 50 డిగ్రీల లైన్‌లో కనిపిస్తాయి. ఆ సమయంలో గ్రహాలు హోరిజోన్ (ఆకాశాన్ని, భూమినీ వేరుచేస్తున్నట్లు కనిపించే రేఖ) నుండి ఆకాశం వైపు సగం వరకు విస్తరించి ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం శుక్ర గ్రహం (వీనస్) చాలా ప్రకాశవంతంగా, మార్స్ చంద్రుడికి చాలా దగ్గరగా కనిపించడం చూస్తూనే ఉంటాం. కానీ ఐదు గ్రహాలు ఒకేసారి కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని సూర్యాస్తమయం అయిన 39 నిమిషాల లోపల మాత్రమే చూడగలం. మెర్క్యురీ, బృహస్పతి త్వరగా హోరిజోన్‌లోకి ప్రవేశించి, మిగిలిన గ్రహాల కంటే ముందుగానే అదృశ్యమవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
- కంటికి కనపడతాయా..! ఎలా..?
'అవును. వీనస్, మార్స్, బృహస్పతి.. మూడు గ్రహాలను కంటితో నేరుగా చూడవచ్చు. మెర్క్యురీ, యురేనస్‌లను గుర్తించడానికి మాత్రం బైనాక్యులర్ సహాయం కావాలి. బృహస్పతి, మెర్క్యురీ హోరిజోన్‌కు దగ్గరగా ఉంటాయి. మార్స్ చంద్రుని పక్కన ఉంటుంది. వీనస్ దానికి సమీపంలో ఉంటుంది. యురేనస్ చంద్రుని పైన 'ఆకుపచ్చ నక్షత్రం' వలే కనిపిస్తుంది' అని వివరించారు కుక్.
అపోలో మాజీ వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ ఐదు గ్రహాల అమరిక గురించి ఇలా వ్యాఖ్యానించారు. 'భూమి మీద నుండి చూసినప్పుడు చంద్రుని నెలవంక వెంబడి ఈ ఐదు గ్రహాలు ఆర్క్ ఆకారంలో అమరి ఉన్నట్లు కనిపిస్తాయి' అని పేర్కొన్నారు.
సూర్యాస్తమయం అయిన వెంటనే పశ్చిమ దిశలో ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అప్పుడు బైనాక్యులర్‌తో చూస్తే మెర్క్యూరీ, దాని పక్కన ప్రకాశవంతమైన బృహస్పతి కనిపిస్తాయని సీనియర్ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ రిక్ ఫీన్‌బర్గ్ అన్నారు.

- గ్రహాలు ఎందుకు సమలేఖనం అవుతాయి?
నాసాలోని లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ ప్రాజెక్ట్‌కు చెందిన శాస్త్రవేత్త నోV్‌ా పెట్రో మాట్లాడుతూ, 'సౌర వ్యవస్థలో గ్రహాలు సూర్యుని చుట్టూ వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతాయి. అందువల్ల తరచూ ఇలాంటి సమలేఖనాలు సంభవిస్తాయి. గ్రహాలు సూర్యుని నుండి వాటి కక్ష్యల్లో తిరిగే క్రమంలో తూర్పు నుండి దిగువన.. దక్షిణాన ఎగువ భాగంలో విస్తరించి ఉన్నప్పుడు, గ్రహాల మధ్య సమలేఖనం జరుగుతుంది. మార్చి 28న స్వర్గం సమలేఖనం అవుతోంది' అని పెట్రో అంటారు.
- ఇది అరుదైన ఖగోళ సంఘటనా?
గ్రహాల అమరికలు జరగడం అసాధారణం కాదు. 'గ్రహాలు సూర్యునికి ఒకవైపు వరుసలో ఉన్న ప్రతిసారీ ఇలా జరుగుతుంది. మొట్టమొదట 2004, డిసెంబర్‌లో ఇలాంటిదే జరిగింది. దాదాపు పద్దెనిమిదేళ్ళ తరువాత 2022, జూన్‌లో 5 గ్రహాల అమరిక ఏర్పడింది. ఈ సంవత్సరం మార్చి 28న మరల ఈ సమలేఖనం. దీని తర్వాత 2040 వరకు ఇలాంటి ప్రత్యేకత పునరావృతం కాకపోవచ్చునని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
ఖగోళ శాస్త్రవేత్త స్టార్‌గేజర్ రోరీ బెంట్లీ మాట్లాడుతూ, 'సాధారణంగా, గ్రహాలు ఆకాశంలో చెల్లా చెదురుగా ఉంటాయి. అవి సాంకేతికంగా ఎప్పుడూ ఏదో ఒక లైన్ వెర్షన్‌లో ఉంటాయి. అంతేకాదు. గ్రహాలు కక్ష్యల్లో తిరిగేటప్పుడు ఒకదానికొకటి దగ్గరగా, ఒకే సరళ రేఖలో ఉన్నట్లు కనిపిస్తాయి. ఒక్క రాత్రిలో మీరు మొత్తం సౌర వ్యవస్థను చాలా అందంగా చూడవచ్చు' అని పేర్కొన్నారు.

- భిన్నాభిప్రాయాలు..
'సూర్యుని చుట్టూ మెర్క్యురీ 88 రోజులపాటు, శుక్రుడు 225 రోజులపాటు తిరిగే క్రమంలో సంవత్సరానికి ఒకసారి ఇలా కనిపిస్తాయి' అని నాసాలోని లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ ప్రాజెక్ట్‌కు చెందిన శాస్త్రవేత్త నోV్‌ా పెట్రో అన్నారు. ఏప్రిల్ 11, ఆగస్టు 24 తేదీల్లో గ్రహాల అమరికను చూసే అవకాశం ఉన్నట్లు ఆయన చెబుతున్నారు.
బుధుడు, యురేనస్, బృహస్పతి, నెప్ట్యూన్, శని ఈ ఐదు గ్రహాల అమరికను జూన్ 17న చూడవచ్చని ఖగోళ శాస్త్ర గైడ్ స్టార్‌వాక్ అభిప్రాయపడుతున్నారు.










