Oct 22,2023 15:28

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన రీడిజైనింగ్‌ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోయిందని, డిజైన్లు తానే రూపొందించానన్న కేసీఆర్‌ ఇప్పుడెందుకు మాట్లాడరని భట్టి ప్రశ్నించారు. గతేడాది వరదల్లో పంపుహౌసులు మునిగి భారీగా నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు.''కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని కేసీఆర్‌, కేటీఆర్‌ పదేపదే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని గొప్పలు చెప్పారు. రూ.30వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్‌ గోదావరిలో పోశారు.'' అని భట్టివిక్రమార్క విమర్శించారు.