నిర్మల్: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలవాలి.. అప్పుడే ప్రజల కోరికలు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. 'ఎలక్షన్లు వస్తాయి పోతాయి.. ఎన్నికలు అన్నప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. ఎవరో ఒకరు గెలుస్తరు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక వజ్రాయుధం ఓటు. మీ ఓటు మీ తలరాతను లిఖిస్తది వచ్చే ఐదేండ్లు. పార్టీల అభ్యర్థలు మంచి చెడు తెలుసుకోవాలి. అభ్యర్థులు గెవడంతో ప్రభుత్వం ఏర్పడతుంది. ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభమేనేది చర్చ జరగాలి. ప్రతి పార్టీ చరిత్ర చూడాలి. ఆయా పార్టీల హాయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. పార్టీ వైఖరి తెలుసుకోవాలి. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తది.. నడవడి ఎట్ల ఉన్నది అనేది గమనించాలి. అప్పుడు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తరు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలుస్తే మీ కోరికలు నెరవేరుతాయి' అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? ఇవన్నీ ఆలోచించాలి. నాలుగు జిల్లాలు చేయాలని ఇంద్రకరణ్ రెడ్డి అడిగారు. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కావాలని గంటసేపు వాదించారు.










