ఓటీటీ మాధ్యమాల రాకతో సినీ అభిమానులకు సరికొత్త వినోదానికి ఢోకా లేకుండా పోయింది. ఓవైపు వెబ్ సిరీస్‌లు, మరోవైపు నేరుగా సినిమాల విడుదలతో ప్రేక్షకులకు వరుస వినోదం అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ఓటీటీ వేదికల సంఖ్యా పెరుగుతోంది. తాజాగా 'ఈటీవీ విన్'లో నేరుగా విడుదలైన చిత్రం 'అసలు'. విభిన్న నేపథ్య కథలతో అలరించే దర్శకుడు రవిబాబు ఇందులో నటించడం, ప్రచార చిత్రాలు ఆసక్తిగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? అసలు ఈ క్రైమ్ థ్రిల్లర్ కథేంటి? చూద్దాం..
కథలోకి వెళ్తే.. నేషనల్ మెడికల్ కాలేజ్‌లో సుప్రసిద్ధ పాథాలజీ ప్రొఫెసర్ వెంకటేశ్ చక్రవర్తి (సూర్య). కాగా వందన (పూర్ణ) ఆయన దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తుంటుంది. ఒకరోజు జూమ్ వేదికగా విద్యార్థులకు క్లాస్ చెబుతుంటాడు ప్రొఫెసర్. ఆ సమయంలో అందరూ చూస్తుండగానే ఆ ప్రొఫెసర్‌ను ఓ ముసుగు వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేస్తాడు. అది చూసి విద్యార్థులు, వందన ఒక్కసారిగా షాక్ అవుతారు. సంచలనంగా మారిన ఈ హత్యను ఛేదించేందుకు సీఐడీ ఆఫీసర్ రంజిత్ (రవిబాబు)ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమిస్తుంది ప్రభుత్వం. అయితే హత్య జరిగిన రోజు నలుగురు వ్యక్తులు, ఒక గుర్తుతెలియని ముసుగు వ్యక్తి ప్రొఫెసర్ నివాసానికి వస్తారు. ఈ నలుగురు ప్రొఫెసర్ ఇంట్లోకి వెళ్లినట్లు సిసి కెమెరాలో రికార్డ్ అవుతుంది. కానీ బయటకు వెళ్లినట్లు మాత్రం రికార్డ్ అవ్వదు. ఈ క్రమంలో కేసు విచారణ చేపట్టిన రంజిత్ దాన్ని ఎలా ఛేదించాడు. ఈ క్రమంలో ప్రొఫెసర్ సహాయకురాలు వందన ఏం చేసింది? ఈ నలుగురిలో ప్రొఫెసర్‌ను ఎవరు చంపారు? అసలు హంతకుడి ఉద్దేశ్యం ఏమిటి? చివరికి రంజిత్ రావు కేసును ఛేదించాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ..

క్రైం సస్పెన్స్ థ్రిల్లర్‌లకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకులు కూడా ఈ తరహా చిత్రాలను ఎక్కువగా ఎంజారు చేస్తున్నారు. ఇక ఓటీటీ అందుబాటులోకి వచ్చాక భాష అర్థం కాకపోయినా సబ్‌టైటిల్స్ చూసి మరీ ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రవిబాబు సిద్ధహస్తుడు. ఆయన నుంచి వచ్చిన 'అమరావతి', 'అవును' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈసారి ఓటీటీ కోసం ఆయన పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రమే 'అసలు'. క్రైమ్ థ్రిల్లర్ పాయింట్‌ను ఎంచుకోవడం, వాటిని సినిమాగా రాసుకోవడం ఒకెత్తయితే, దానిని తెరపై ప్రజెంట్ చేయడం మరొకఎత్తు. హత్యకేసు చుట్టూ తిరిగే ఆసక్తికర కథగా 'అసలు'ను ప్రేక్షకులకు అందించడంలో దర్శకులు ఉదరు, సురేష్‌లు కొంత విజయం సాధించారు. ప్రేక్షకుడిని ఎక్కువసేపు వేచి చూడనీయకుండా ప్రొఫెసర్ హత్యతో నేరుగా కథను మొదలు పెట్టేశారు దర్శకులు. అక్కడి నుంచి జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ సాదాసీదాగా ఉంటాయి. హంతకుడి చుట్టూ ఉన్న వారిపై అనుమానం కలిగేలా సాగే కథనం చాలా సినిమాల్లోనే చూశాం. ఇందులోనూ హత్యకు ముందు ప్రొఫెసర్‌ను నలుగురు వ్యక్తులను కలవడం, రంజిత్ వారిని విచారించడం, ప్రొఫెసర్‌తో వారికున్న వైరాన్ని చెబుతూ సాగే సన్నివేశాలు కథను ముందుకు నడపడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి.
ఇక ద్వితీయార్ధంలోనే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడి నుంచి కథ, కథనాలు కాస్త మెప్పిస్తాయి. అసలైన హంతకుడు ఎవరో తెలిసిన తర్వాత ఆ హత్య ఎందుకు, ఎలా చేశారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన రంజిత్ డీకోడ్ చేస్తూ చెప్పే సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. అయితే, ఈ విషయంలో కథా రచయిత, దర్శకులు సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువ తీసేసుకున్నారు. అంతా హంతకుడు అనుకున్నట్లే ఎలా జరుగుతుంది? అన్న ప్రశ్న సినిమా చూసే ప్రేక్షకుడికి కలుగుతుంది. దానికి జవాబు చెప్పేందుకే అన్నట్లు, సినిమాను ఇంకాస్త పొడిగించి, ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగించేలా ఎయిర్‌పోర్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను జోడించారు. ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని, నిడివి విషయంలో చిత్ర బృందం చాలా పర్‌ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంది. ప్రారంభం నుండి చివరి వరకూ తర్వాత ఏమి జరుగబోతోంది అనే ఉత్కంఠని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రంజిత్ పాత్రలో దర్శకుడు, నటుడు రవిబాబు కనిపించారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. చాలా సులువుగా చేసుకుంటూ వెళ్లిపోయారు. వందనగా పూర్ణ బాగానే చేశారు. ప్రొఫెసర్‌గా నటించిన సూర్య పాత్రలోనే కాస్త షేడ్స్ ఉన్నాయి. ఆ పాత్రకు ఆయన న్యాయం చేశారు. మిగిలిన వాళ్లు పాత్రల పరిధిమేరకు నటించారు. ఎస్‌ఎస్ రాజేశ్ సంగీతం ఓకే. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఇంటిల్లిపాదీ చూసేలా సినిమాను తీర్చిదిద్దారు.
టైటిల్ : అసలు
నటీనటులు : రవిబాబు, పూర్ణ, సూర్య,
సత్య కృష్ణన్, ప్రణవి మనుకొండ తదితరులు..
సినిమాటోగ్రఫీ : చరణ్ మాధవనేని
ఎడిటింగ్ : సత్యనారాయణ బళ్లా
సంగీతం : ఎస్ ఎస్‌రాజేశ్
కథ, సంభాషణలు, నిర్మాత, పర్యవేక్షణ: రవిబాబు
దర్శకత్వం : ఉదరు, సురేష్
ఓటీటీ : ఈటీవీ విన్










