ప్రజాశక్తి-సాలూరు: సాలూరు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. కమిషనర్ హెచ్.శంకరరావు ఎసిబి వలలో చిక్కి సస్పెండై 18 రోజులైంది. ఇంతవరకు కొత్త కమిషనర్‌ని మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయం నియమించలేదు. మున్సిపల్ ఎఇ ఎల్.సూరినాయుడును ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమిస్తూ మున్సిపల్ డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టి వారం రోజులు కాకముందే సెలవులోకి వెళ్ళిపోయారు. అటు ఇన్‌ఛార్జి డిఇగా, ఇటు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు భయపడి ఎఇ సూరినాయుడు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపల్ డిఇ ఉన్నప్పుడు ఆయనే ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేవారు. డిఇ పోస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. ఎఇ సూరినాయుడు డిఇ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ బాధ్యతలు కూడా అప్పగించడంతో ఆయన బెంబేలెత్తి సెలవు పెట్టినట్లు సమాచారం. అసలే ఎసిబి దాడులు జరగడంతో మిగిలిన విభాగాల అధికారులు బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే అధికారి మూడు కీలక విభాగాల బాధ్యతలు నిర్వహించడమంటే కత్తిమీద సాము లాంటిదే.
పట్టణంలో కొన్ని కీలకమైన పనులకు సంబంధించి ఒత్తిడులు పెరుగుతున్న కారణంగా ఇంఛార్జి కమిషనర్ బాధ్యతలు నిర్వహించడానికి ఎఇ సూరినాయుడు భయపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎఇ సూరినాయుడు సెలవు పెట్టడంతో మేనేజర్ రాఘవాచార్యులుకు డెలిగేషన్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా కమిషనర్ బాధ్యతలు నిర్వహించడానికి భయపడుతున్నారు.
రెండు వారాలుగా పురపాలన పూర్తిగా గాడి తప్పింది. చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె కార్యాలయానికి వచ్చే పరిస్థితి లేదు. కొద్దిరోజుల క్రితం చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ.. కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. భర్త అనారోగ్యం కారణంగా తాను తరచూ కార్యాలయానికి రాలేనని నిస్సహాయత వ్యక్తం చేశారు. తన తర్వాత ఉన్న వైస్ చైర్మన్లే పర్యవేక్షణ చేస్తారని చెప్పారు.
సమన్వయం లేని వైస్ చైర్మన్లు
మున్సిపల్ వైస్‌చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు పట్టణంలో వైసిపిలో చెరో గ్రూపునకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పట్టణ పార్టీలో గ్రూపు రాజకీయాల ప్రభావం పురపాలనపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో కీలక నిర్ణయాలు జాప్యం అవుతున్నాయి. వైస్ చైర్మన్ల మధ్య సమన్వయం లేకపోవడంతో అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరి మాట వింటే ఎవరికి కోపం వస్తుందోనని భయపడుతున్నారు. నెలనెలా జరిగే మున్సిపల్ సాధారణ సమావేశాలు కూడా గత కొద్దినెలలుగా మొక్కుబడిగా సాగుతున్నాయి. సమావేశాల్లో కౌన్సిలర్లు అడిగే సమస్యలపై జవాబుదారీతనంతో సమాధానం చెప్పే అధికారులు లేరు. చైర్‌పర్సన్ ఈశ్వరమ్మ భర్త అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమె పురపాలనపై దృష్టిసారించలేదు. దీంతో ఇటీవల సస్పెండైన కమిషనర్ శంకరరావు అన్నీ తానై వ్యవహరించి రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాలకవర్గాలు చేయాల్సిన నిర్ణయాలు, పనులు పూర్వ కమిషనర్ శంకరరావు చేసి అత్యాశకు పోయి ఎసిబి వలలో చిక్కిపోయారు.
కమిషనర్ నియామకంలో జాప్యమెందుకో
మున్సిపల్ కమిషనర్ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 18 రోజులైనా కొత్త కమిషనర్ నియామకంపై స్పష్టత లేదు. మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయంలో ఏ అధికారి పాచికలు పారతాయో వారే ఇక్కడకు కమిషనర్‌గా వచ్చే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సిఎం రాజన్నదొర పాలకొండ నగర పంచాయతీ మేనేజర్ జయరాంకు ఇన్‌ఛార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా అధికారపార్టీకి చెందిన కీలక నేతలు మరో ఇద్దరు అధికారులకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కమిషనర్ నియామకం జాప్యమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.










