ఈ కాలం యువత ప్రేమ, పెళ్లి వంటి బంధాలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సున్నిత మనస్కురాలైన ఓ యువతి పెళ్లి కాకుండా తల్లి కావాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని వల్గారిటీగా చెప్పకుండా కుటుంబసభ్యులు ఆలోచించేలా.. ముఖ్యంగా యువత ఆలోచనా ధోరణిని తెరపై చూపించారు దర్శకుడు పి. మహేశ్‌బాబు. ఇటువంటి సినిమా అనుష్కలాంటి స్టార్ హీరోయిన్ చేయడం పట్ల అభిమానులు ఆసక్తి కనబరిచారు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని కామెడీ, ఎమోషన్స్‌తో తెరపై చూపించారు. అందుకు నవీన్ పోలిశెట్టిని హీరోగా సరిగ్గా ఎంపిక చేసుకున్నారు. ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు కచ్చితంగా ఉండాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు.
కథేంటంటే : అన్వి అలియాస్ అన్విత రవళి శెట్టి (అనుష్క) మాస్టర్ చెఫ్. లండన్‌లో ఓ పెద్ద స్టార్ హోటల్‌లో పని చేస్తుంటుంది. తనకు ప్రేమ, పెళ్లి బంధాలపై ఏమాత్రం నమ్మకం ఉండదు. దీనికి కారణం తన తల్లి (జయసుధ)ని ప్రేమించి.. పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడమే. అయితే, తన తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. అన్విత ఒంటరవుతుంది. దాని నుంచి బయట పడటానికి తాను ఓ బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోకుండానే ఐయూఐ విధానంలో ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. దీనికోసం వీర్య దాత కోసం వెతుకుతుండగా.. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి (నవీన్ పొలిశెట్టి) పరిచయమవుతాడు. తన బిడ్డకు ఎలాంటి తండ్రి కావాలనుకుంటుందో అలాంటి లక్షణాలన్నీ సిద్ధులో కనిపించడంతో అతని సహాయం తీసుకోవాలని అనుకుంటుంది. అయితే అన్వి తనపై చూపిస్తున్న కేర్‌ను చూసి ఆమెను ప్రేమిస్తాడు. కాని అన్వి తాను సిద్ధుకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణాన్ని వివరిస్తుంది. తల్లి కావడానికి తనకు సహాయం చేయమని కోరుతుంది. అయితే ఆమె నిర్ణయం తెలిసి సిద్ధు ఒక్కసారిగా కంగు తింటాడు. పెళ్లి చేసుకోకుండా బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం సమాజానికి విరుద్ధమని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మరి అన్విత తాను అనుకున్నది సాధించిందా? ఆమె ఇండియా నుంచి లండన్‌కు ఎందుకు తిరిగి వెళ్లిపోయింది? సిద్ధు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న అన్వితను ఎలా మార్చాడు? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అన్నది మిగతా కథ.ఫేమస్ చెఫ్‌గా అనుష్కను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లితో ఆమె బాడింగ్ చూపించారు. అవి కాస్త ఎమోషనల్‌గా ఉన్నప్పటికీ.. రొటీన్‌గా అనిపిస్తుంది. ఇక హీరో ఎంట్రీ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నప్పటి కామెడీతో నవ్విస్తే.. మరికొన్ని చోట్ల బోర్ తెప్పిస్తాయి. స్పెర్మ్ డొనేషన్ కోసమే తనతో క్లోజ్‌గా మూవ్ అయిందనే విషయం తెలిశాక హీరో ఏం చేశాడనేది సెకండాఫ్. ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఆమె అడిగిన సహాయం చేస్తాడనేది అందరికి అర్థమైపోతుంది. కానీ ఈ క్రమంలో జరిగే సన్నివేశాలను హిలేరియస్‌గా రాసుకున్నాడు దర్శకుడు. ఆస్పత్రిలో, కొన్ని సీన్లలన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. చివరల్లో మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. అసలు హీరోయిన్ ప్రేమ, పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందనే కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌గానూ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అయితే కథంతా ఒక పాయింట్ చుట్టే తిరగడంతో సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.

ఈ సినిమా మొత్తం అనుష్క, నవీన్ పోలిశెట్టి పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్‌గా వీరి మాత్రమే చేయగలరు అనేంతగా నటించారు. చెఫ్ అన్విత పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. తెరపై చాలా హుందాగా కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించింది. ఇక నవీన్ పోలిశెట్టి మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ కన్నీళ్లు పెట్టించారు. మిగిలిన నటీనటులు సన్నివేశాలకు తగ్గట్టుగా నటించారు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. రధన్ పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

చిత్రం : మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
నటీనటులు : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి, నాజర్, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు
సంగీతం : రధన్
నిర్మాతలు : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పి మహేష్ బాబు










