Apr 16,2023 08:40

గుర్రపుడెక్క పీత (హార్స్‌ షూ పీత) 'సజీవ శిలాజం'. దీని వయస్సు 450 మిలియన్‌ సంవత్సరాలని పాలియోంటాలాజికల్‌ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఎటువంటి స్వరూప, స్వభావ మార్పులకు గురికాకుండా 450 మిలియన్‌ సంవత్సరాల కాలం జీవించిన అతి పురాతన జీవి. వీటి రోగనిరోధక 'శక్తి'ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. వైద్యపరీక్షల్లో అంటే.. వ్యాక్సిన్లు, ఇతర ఇంజెక్షన్లు, సర్జికల్‌ ఇంప్లాంట్లు సూక్ష్మజీవులతో కలుషితం కాలేదని నిర్ధారించుకునేందుకు ఈ పీతల రక్తం ఉపయోగ పడుతుందని 1960వ దశకంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందో లేదో ఇవి ఇట్టే గుర్తిస్తాయి. ఎంత విచిత్రం..!

2


మా నవ రక్తంలో ఇనుము ఉండడం వల్ల ఎర్రగా ఉంటుంది. పీతల రక్తంలో ఉండే రాగి ఖనిజం వల్ల రక్తం నీలం రంగులో ఉంటుంది. రాగితో పాటు బాక్టీరియాని గడ్డ కట్టించగలిగే ఒక ప్రత్యేక రసాయనం ఉంటుంది. అది అమెరికన్‌ జీవ జాతుల్లో లిములుస్‌ ఎమ్బోకైట్‌ లైసెట్‌, ఆసియన్‌ జీవ జాతుల్లో ఎమ్బోకైట్‌ లైసెట్‌ గా ఉంది. సముద్ర తీర ప్రాంతాల నుంచి హార్స్‌ షూ పీతలను సేకరించి.. ల్యాబ్‌కు తెచ్చి, వాటి బరువును తూచి.. రక్తం సరిపడా ఉన్నవాటిని మాత్రం తీసుకుని.. శుభ్రం చేసి.. గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులుగుచ్చి రక్తం సేకరిస్తారు. సగానికి పైగా రక్తాన్ని తీసిన తర్వాత వాటిని మళ్లీ సముద్రంలోనే వదిలిపెడతారు. ఐతే ఇలా రక్తం తీసిన పీతల్లో మూడో వంతు మరణిస్తుంటాయి.

3
  • బయోమెడికల్‌ పరీక్షల్లో..

పీత రక్తకణాలను వేరుచేసి ఎల్‌ఏఎల్‌ (లిమ్యులస్‌ అమిబోసైట్‌ లైసేట్‌)ను ఉత్పత్తి చేస్తారు. వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్‌, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలను దీనితో పరీక్షిస్తారు. వాటిలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నా.. ఏదైనా కల్తీ జరిగినా ఎల్‌ఏఎల్‌ గుర్తిస్తుంది. అలా గుర్తింపబడిన టీకా లేదా ఔషధాన్ని పడేస్తారు. లేదంటే శుద్ధిచేసి ఉపయోగిస్తారు. వేగవంతమైన రోగనిర్ధారణ కారకాల తయారీకి, ప్రీ-ఎక్లాంప్సియా (గర్భధారణ సమయంలో కలిగే అధిక రక్తపోటు.. మరికొన్ని ఇబ్బందులు) చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేకాదు శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్‌మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్‌ పరికరాలను కూడా ఎల్‌ఏఎల్‌తో పరీక్షించి బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్న తర్వాత అమర్చుతారు.

  • పొంచి ఉన్న ముప్పు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుండటంతో.. ఈ పీతల సేకరణ మరింతగా పెరిగింది. గత 40 ఏళ్లలో వీటి సంతతి 80 శాతం తరిగిపోయిందని అంచనా. అమెరికా, మెక్సికో, చైనా, ఒడిశా, మరికొన్ని దేశాల్లోనూ హార్స్‌ షూ పీతలు అదశ్యమవుతున్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. బయో- మెడికల్‌ అవసరాల కోసం వీటిని అత్యధికంగా వేటాడటమే కాక పెద్ద చేపల తాకిడి, ఆవాసాల కొరత, నీటి కాలుష్యం కారణంగా కూడా వీటి సంతతికి ముప్పుపొంచి ఉంది.
ప్రొఫెసర్‌ బి.సి. ఒడిశా రాష్ట్ర వన్యప్రాణి సలహా మండలి సభ్యుడు డా. చౌదరి, గోవాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ విశ్రాంత శాస్త్రవేత్త డా. అనిల్‌ ఛటర్జీ ఇలా అంటున్నారు. 'మేము 1988-89లో ఒడిశాకు వచ్చినప్పుడు 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 30 నుండి 40 పీతల నమూనాలు సేకరించాము. ఇటీవల, బాలాసోర్‌కు వెళ్ళాము. ఎంత శాతం తరిగి పోయాయి!' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మనం ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో ఈ జాతి కనిపించదు' అని ఆయన హెచ్చరిస్తున్నారు.

4
  • పునరుద్ధరణ సాధ్యమా..

ఒడిశాలోని బాలాసోర్‌, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, సుందర్బన్‌ తీరాలకు ఈ పీతలు సంతానోత్పత్తి కోసం వస్తాయి. అవి గుడ్లు పెట్టడానికి తగిన స్థలాన్ని ఎంచుకుంటాయి. అయితే ఆ గుడ్లకు స్థానిక ప్రజల చర్యల వల్ల నష్టం జరుగుతోంది' అని ఛటర్జీ విచారం వ్యక్తం చేశారు. డా. చౌదరి 'ఈ పీతల సంతానోత్పత్తి ప్రదేశాలను, పరిరక్షణ ప్రాంతంగా ప్రకటించి జాతిని కాపాడాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (వన్యప్రాణులు)కి లేఖ రాశారు. డా. ఛటర్జీ, డా. చౌదరి గుర్రపుడెక్క పీతలను సముద్ర జాతుల జాబితాలో ఉంచి, పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.

  • ప్రత్యామ్నాయం..

విధ్వంసక చేపలు పట్టే పద్ధతుల వల్ల జీవ శిలాజం అంతరించిపోకముందే పటిష్టమైన రక్షణ యంత్రాంగాన్ని రూపొందించాలని శాస్త్రవేత్తలు ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. వీటిని చంపకుండా ప్రత్నామ్నాయాల వైపు ఆలోచించాలని పీతల సంరక్షకులు కోరుతున్నారు. వైద్య పరీక్షల్లో సింథటిక్‌ పద్ధతులను అవలంబించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సింథటిక్‌ పద్ధతులు కేవలం పైకి కనిపించే హానికారకాలను మాత్రమే గుర్తించగలవని.. పీతల రక్తంతోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.

7