ప్రజాశక్తి -పిఎం పాలెం (విశాఖపట్నం) : వైజాగ్ వేదికగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) సీజన్ - 2 బుధవారం వైభవంగా ప్రారంభమైంది. సినీ హీరోయిన్ శ్రీలీల గౌరవ అతిథిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి.శరత్‌చంద్రారెడ్డి పోటీలను ప్రారంభించి మాట్లాడారు.
తలపడిన కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్
పిఎం.పాలెం క్రికెట్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఎపిఎల్ లీగ్ మ్యాచ్‌లో మొదటిగా కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్ టీమ్‌లు తలపడ్డాయి. 12 పరుగుల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటగా టాస్ గెలిచిన బెజవాడ టైగర్స్ బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగారు. బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 149 పరుగులు చేసి ఎనిమిది టికెట్లు కోల్పోయింది. చివరలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఎల్ రెడ్డి, పి.మనోహర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 16 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఓపెనర్లు నిరుత్సాహపరిచినా మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు స్కోర్‌ను పెంచుకుంటూ ముందుకు సాగారు. బెజవాడ టైగర్స్ బౌలర్లు కె.సాయితేజ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసి 41 పరుగులు ఇచ్చాడు. మోహన్ నాలుగు ఓవర్లకు 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ 137 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మిడిల్ ఆర్డర్‌లో ఎం.అభినవ్ 44 బంతులలో మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 57 పరుగులు చేశాడు. బెజవాడ టైగర్స్ కెప్టెన్ రిక్కీ బుయి మూడు పరుగులు చేసి నిరుత్సాహపరిచాడు. కోస్టల్ రైడర్స్ బౌలర్లు స్టీఫెన్, కె.సుదర్శన్, ఆశిష్, మనోహర్ ఒక్కొక్కరు రెండేసి వికెట్లు చొప్పున ఎనిమిది వికెట్లు తీశారు. 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మనోహర్ నిలిచాడు.










