Oct 30,2023 09:45
  • ఆగి ఉన్న రైలును ఢీకొన్న మరో రైలు
  • 14 మంది దుర్మరణం
  • వంద మందికి గాయాలు !
  • అంథకారంలో ఘటనా స్థలం
  • సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం
  • క్షతగాత్రులను విజయనగరం, విశాఖ, ఎస్‌కోట తరలింపు
  • కలెక్టరేట్‌, రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు

ప్రజాశక్తి- యంత్రాంగం : విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి సమీపాన ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.
            ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే, మృతుల సంఖ్య 20పైనే ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. వందమంది వరకు గాయపడినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... విశాఖ నుంచి పలాస వెళ్తున్న పాసింజర్‌ రైలు కంటకాపల్లి దాటిన తరువాత భీమాళి సమీపాన ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపడడంతో విద్యుత్‌ సరఫరా లేక పట్టాలపై నిలిచిపోయింది. దాని వెనుకే వస్తున్న విశాఖ-రాయగడ పాసింజర్‌ రైలుకు కంటకాపల్లి స్టేషన్‌లో గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో ఆ రైలు స్పీడ్‌గా వచ్చి విశాఖ-పలాస రైలును బలంగా ఢకొీంది. దీంతో, ఈ రెండు రైళ్లకు చెందిన చెరో రెండు భోగీలు పట్టాలు తప్పడమే కాకుండా నుజ్జునుజ్జయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో వెంటనే భీమాళి తదితర గ్రామాల ప్రజలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, విజయనగరం జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాత్రి 11 గంటల వరకు ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో విజయనగరం జిల్లా జామి మండలం గడికొమ్ము గ్రామానికి చెందిన కె. రవి (30), గదబవలసకు చెందిన మజ్జి రాము, గరివిడి మండలం కాపుశంబాం గ్రామానికి చెందిన గిరిజాల లక్ష్మి, శ్రీకాకుళానికి చెందిన ఆకుల నాయుడు, విశాఖ-రాయగడ పాసింజర్‌ రైలు డ్రైవర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సుమారు వంద మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. రైళ్లు ఢకొీనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ తీగెలు తెగిపోవడంతో ఆ ప్రాంతమంతా అంథకారం నెలకొంది. దీంతో, సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. రైళ్లలో ప్రయాణికులను స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయనగరం, ఎస్‌.కోట డిపోల నుంచి బస్సులను రప్పించి ప్రయాణికులను తరలించారు. జిల్లాలోని పలు అగ్నిమాపక వాహనాలు చేరుకొని సహాయ చర్యల్లో నిమగమయ్యాయి. క్షతగ్రాతులను విజయనగరం, విశాఖ, ఎస్‌కోట తరలించారు.

12

 

                                                                          కంట్రోల్‌ రూముల ఏర్పాటు

బాధితుల సహాయం కోసం విజయనగరం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ కె.నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్‌ కార్యాలయంలో 9493589157 ఫోన్‌ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే ఫోన్‌ నంబర్‌ 8978080006కు కాల్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. విశాఖలో రైల్వే కంట్రోల్‌ రూం 8978080777 నంబర్‌తో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

56

                                                             ఆగిన రైళ్లు... ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

ప్రమాదంతో రైలు భోగీలు పక్కనున్న పట్టాలపై ఎగిరిపడడంతో అటు విశాఖపట్నం, ఇటు రాయగడ, భువనేశ్వర్‌వైపు వెళ్లాల్సిన పలు రైళ్లు విజయనగరం రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయాయి. సికింద్రాబాద్‌ వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్‌, ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, చెన్నై వెళ్లే సంత్రగంజ్‌, కోర్బా తదితర రైళ్లు నిలిచిపోయాయి. గొట్లాం స్టేషన్‌లో సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులంతా రైలులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 

                                                          క్షతగాత్రులకు సిపిఎం నాయకుల పరామర్శ

విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి క్షతగాత్రులను అంబులెన్సుల్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నాయకులు జి.శ్రీనివాస్‌ పరామర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు చేరుకొని క్షతగాత్రులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

34


 

                                           గవర్నర్‌, సిఎం దిగ్బ్రాంతి : సహాయక చర్యలకు ఆధికారులకు ఆదేశం

రైలు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్ధుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లూ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్య, పోలీసులు, రెవెన్యూ సహా ఇతర న్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు ఆందేలా చూడాలని ఆదేశించారు.
 

                                                             రైల్వే మంత్రి రాజీనామా చేయాలి : సిపిఎం

రైలు ప్రమాదంలో మరణించిన వారికి సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది. గాయపడిన వారికి అత్యవసర సహాయం అందించి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. బలాసోర్‌ (ఒడిశా) ప్రమాదం మరిచిపోకముందే సిగల్‌ కారణంగా మరో రైలు ప్రమాదం అదే లైనులో జరగడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోందని పేర్కొన్నారు. రైల్వే సామర్థ్యాన్ని పెంచడానికి బదులు ప్రయివేటీకరణ విధానాలతో ప్రయాణికుల ప్రాణాలతో చలగాటమాడడం క్షంతవ్యం కాదని తెలిపారు. ఈ ప్రమాదాలకు బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
 

                                                      క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : లోకేష్‌

రైలు ప్రమాదంపై టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఒక ప్రకటనలో కోరారు. సమీపంలోని టిడిపి కార్యకర్తలు తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలని కోరారు.

23

                                                                సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బొత్స

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి ఎం.దీపిక, ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఆర్‌డిఒ సూర్యకళ, ఎల్‌.కోట ఎంపిపి గేదెల శ్రీనివాసరావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో శ్రీకాకుళం ఎంపి కె.రామ్మోహన్‌నాయుడు ఉన్నారు.

                                                              రైల్వే మంత్రి రాజీనామా చేయాలి : సిపిఎం

విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారికి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. గాయపడిన వారికి అత్యవసర సహాయం అందించి, ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాలాసోర్‌ (ఒరిస్సా) ప్రమాదం మరిచిపోకముందే సిగల్‌ కారణంగా మరో రైలు ప్రమాదం అదే లైనులో జరగడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నదన్నారు. రైల్వే సామర్థ్యాన్ని పెంచడానికి బదులు ప్రయివేటీకరణ విధానాలతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడడం క్షంతవ్యం కాదన్నారు. ఈ ప్రమాదాలకు బాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

                                                                                ప్రధాని దిగ్భ్రాంతి

విజయనగరం రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం అందిస్తామని తెలిపారు. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌తో సమీక్షించారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మరణించిన వారికి ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

                                                                 పరిస్థితి అదుపులోనే ఉంది : రైల్వే మంత్రి

రెండు పాసింజర్‌ రైళ్లు ఢీకొన్న అనంతర పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఆయన ఎఎన్‌ఐ వార్తా సంస్థ తో మాట్లాడుతూ, ప్రధాని పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రితో తాను మాట్లాడానని పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉన్నట్లు తెలిపారని అన్నారు.