ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : హమాలి కార్మికులకు సమగ్రమైన వేతన చట్టం తీసుకురావాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.ఎస్.రాధాకృష్ణ ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల జిల్లా ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ ఎం.వెంకటేశ్వర్లు అధ్యక్షతన కార్మిక కర్షక భవన్‌లో శనివారం హమాలీ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ కార్మికులు దుర్భరమైన పరిస్థితిలో ఎదుర్కొంటున్నారన్నారు. వయసు ఉన్నప్పుడు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న హమాలీ కార్మికులు వయసు మీద పడిన తర్వాత వృద్ధాప్యంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అందుకని హామాలీల కార్మికులకు ఆరోగ్య సమస్యలు పరిష్కారం కోసం సమగ్రమైనటువంటి ఒక చట్టం తీసుకురావలసి ఉందన్నారు. గవర్నమెంట్ హామాలి కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వమే వారికి వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వయసు మీద పడిన తర్వాత వారికి కనీస పెన్షన్ వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే వారికి సంక్షేమ బోర్డు అవసరమని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రభుత్వం వారికి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాధాకష్ణ కార్యదర్శి అంజిబాబు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఈనెల 26 నుండి 31వ తేదీ వరకు జరప తలపెట్టిన మహా పాదయాత్రలో హామాలి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి చెందితేనే హమాలీ కార్మికులకు పనులు దొరుకుతాయని జిల్లా కరువు కాటకాలతో ఉంటే పనులు దొరకవని వారు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్లాన్ రూపొందించి అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకు వెళ్లడానికే సిపిఎం పాదయాత్ర నిర్వహిస్తుందని, పాదయాత్రను జయప్రదం చేయవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని వారన్నారు. హమాలీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశలవారీ ఆందోళనలో హమాలీ కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సంతకాల సేకరణ ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయడం ఆగస్టు 2వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయడం ఆగస్టు 17న చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలను జయప్రదం చేయడానికి హమాలీ కార్మికులు తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజరు, న్యూ సిటీ కార్యదర్శి సాయిబాబా, అధ్యక్షులు నరసింహులువే ర్ హౌస్ యూనియన్ నాయకులు విజయుడు నాగస్వాములు తదితరులు పాల్గొన్నారు.










