
మనసులో కోరిక బలంగా ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి. విశాల్ మెకానికల్ ఇంజనీరింగ్ కావాలనుకున్నాడు. పేదరికం అతని ఆశలపై నీళ్లు చల్లింది. అయినా పట్టు వదలకుండా కొత్త కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. చదువుకోకపోయినా తన మేధస్సుతో పాత బైకులను ఉపయోగించి కారు తయారీకి ఎంతో శ్రమించాడు. చివరికి సాధించాడు. 19 ఏళ్ల వయసులో విశాల్ పనితనం చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా, సన్నోద్ గ్రామానికి చెందిన విశాల్‌కు చిన్నప్పటి నుంచి మెకానికల్ పనులపై మక్కువ ఎక్కువ. ఏ యంత్రాన్ని చూసిన వెంటనే దాన్ని ఊడదీసి, తిరిగి బిగించేవాడు. అతని పుట్టినరోజుకు బహుమతిగా ఇచ్చిన రిమోట్ కంట్రోల్ కారు బొమ్మను వెంటనే విడదీసి, లోపల ఏ ఏ భాగాలు ఉన్నాయో చూసి, తిరిగి కలిపాడు. పేద కుటుంబానికి చెందిన విశాల్ తండ్రి ప్రయివేటు బస్సు డ్రైవర్. తల్లి ఆశా వర్కర్. తండ్రి మద్యానికి బానిస అవడం, తక్కువ ఆదాయంతో ఇల్లు గడిచేది. తన ఖర్చుల కోసం చదువుకుంటూనే పార్ట్‌టైం కొరియర్ బారుగా పనిచేస్తున్నాడు. తండ్రిని చూస్తూ పెరిగిన విశాల్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇంటర్ చదువుతున్నప్పుడే రాంచో డ్రైవర్ కావాలని కలలు కనేవాడు. కాని ఇంట్లో ఆర్థిక సమస్యలు అనుకూలించలేదు. అయినా పట్టు వదలకుండా ఏవేవో మెకానికల్ పనులు చేస్తూనే ఉండేవాడు. షెడ్‌లో వాడకుండా పక్కనబెట్టిన మోటార్‌సైకిళ్లను ఇంటికి తీసుకొచ్చి టైర్లు, ఇంజిన్ ఊడదీసి వేరే వస్తువులుగా మార్చేవాడు. అది చూసిన ఊరిలో జనం 'చేతులు ఖాళీగా ఉండవు. అందుకే పిచ్చి పనులు చేస్తుంటాడు' అని నవ్వుకునేవారు. వారి మాటలు పట్టించుకోకుండా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. పాత బజాజ్ 'బాక్సర్' మోటార్‌సైకిల్‌ను పట్టుకున్న కొద్ది నిమిషాల్లోనే ఊడదీయగల నైపుణ్యం సాధించాడు.
కారు తయారీలా...
రెండు నెలల క్రితం విశాల్‌కు రెండు పాత బైక్‌లు దొరికాయి. వాటిని ఊడదీసి కారు తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే దానికి దగ్గ ప్లానింగ్‌తో కావాల్సిన వస్తువులను తెచ్చుకున్నాడు. అయితే ఇంటర్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాడు. కారుకు తగ్గట్టుగా ఇనుప గొట్టాలను ఉపయోగించి, నాలుగు చక్రాల కారుగా మార్చాడు. కరెంట్ క్యారీయింగ్ కెపాసిటీ రెండూ ఉండే విధంగా అమర్చాడు. పాత బజాజ్ బాక్సర్ ఇంజిన్‌ను బిగించాడు. అయిదుగురు ప్రయాణికులు కూర్చునే విధంగా సీట్లు ఏర్పాటుచేశాడు. ప్రస్తుతానికి, ఈ కారు గంటకు 40 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. లీటరుకు 35 కి.మీ మైలేజీని ఇస్తుంది. తనకు ఇష్టమైన రాంచో వాహనంగా దీనిని మలుచుకున్నాడు. దీని కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఎవరైనా చూస్తే ఎగతాళి చేస్తారని ఎవరికీ తెలియకుండా ఊరి చివర ఓ షెడ్‌లో మెకానిక్ వర్క్ మొత్తం చేసుకున్నాడు. రెండు నెలల తర్వాత వాహనం పూర్తి చేసి రోడ్లు మీద తీసుకువచ్చాడు. ఇది చూసిన వాహనదారులు తమకూ కూడా తయారు చేసి ఇవ్వాలని కోరుతున్నారు.
విశాల్‌కు ఇటువంటి కొత్త విషయాలను కనుగొనడం, వస్తువులు తయారు చేయడం అంటే ఆసక్తి. తన ఇద్దరు స్నేహితులైన నిఖిల్, అతుల్‌తో కలిసి 'క్లైమాక్స్ ఎక్స్‌పరిమెంట్స్' అనే యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ప్రారంభించాడు. ఖాళీ సమయాల్లో చిన్న చిన్న సైంటిఫిక్ ప్రయోగాలను వీడియోలు చేసి ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాడు. ఎల్‌పిజి సిలిండర్‌తో ట్రాక్టర్‌కు శక్తినివ్వడం, ఏమి జరుగుతుందో చూడటానికి పాత టెలివిజన్ సెట్‌ను కొండపై నుండి పడేయడం వంటి ప్రయోగాత్మక విషయాలను యూట్యూబ్‌లో పంచుకుంటున్నాడు.
పై చదువుల నిమిత్తం విశాల్‌కు డబ్బు అవసరం ఉంది. దాంతో ఈ కారు డ్రైవర్‌గా- ప్రయాణికులను ఎక్కించుకుని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాడు. అలా వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులకు సహాయపడుతూ... తానూ కొంత దాచుకుంటున్నాడు. చాలా మంది యువకులు తమ ప్రతిభను గుర్తించక సమయాన్ని వృథా చేస్తున్నారు. అటువంటివారికి విశాల్ ఓ ఆదర్శం.