Sep 24,2023 10:44

ఓ బాలుడి ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన బాలుడు వేగంగా వెళుతున్న రైలుకు అడ్డంగా నిలబడి ఆపాడు. వందల మంది ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని మాల్దా జిల్లా కరియాలి గ్రామంలో పదేళ్ళ బాలుడు ముర్సలీమ్‌ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. గత శుక్రవారం అతడు గ్రామ సమీపంలోని ఓ చెరువలో చేపలు పట్టడానికి వెళుతూ రైలు పట్టాలవద్దల చేరుకున్నాడు. పట్టాలు దాటుతుండగా ప్రమాదకరమైన గొయ్యిని అతడు గుర్తించాడు. అంతలోనే అదే పట్టాలపై అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ వేగంగా దూసుకువస్తోంది. అప్రమత్తమైన ముర్సెలీమ్‌ వేగంగా పట్టాల వద్దకు పరుగెత్తాడు. తన ఒంటిపై ఉన్న ఎర్ర టీషర్టు ఊపుతున్న బాలుడిని గమనించిన లోకోపైలట్‌ వెంటనే రైలును నిలిపివేశారు. ఇంజిన్‌ దిగి, పట్టాల పరిస్థితి చూసి బాలుడిని అభినందించారు. వర్షాలకు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకుపోయినట్లు ఆయన ఇచ్చిన సమాచారంతో వివిధ విభాగాల రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంధ్రాన్ని పూడ్చివేశారు. గంట తర్వాత రైలు యథావిథిగా బయలుదేరింది. ముర్సెలీమ్‌ పేరును అవార్డు కోసం సిఫార్సు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.