Aug 19,2023 21:19

సదస్సులో మాట్లాడుతున్న లీగల్‌ సెల్‌ కమిటీ చైర్మన్‌ దామోదరరావు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : జాతీయ లోక్‌ అదాలత్‌ను సెప్టెంబరు 9న నిర్వహించనున్నట్లు రెండో అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్‌ సెల్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.దామోదరరావు తెలిపారు. రాజీ మార్గం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని పేర్కొన్నారు. శనివారం స్థానిక కోర్టు భవనంలో పోలీస్‌, బ్యాంక్‌ అధికారులు, న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులతో జాతీయ లోక్‌ అదాలత్‌పై సమావేశం ఏర్పాటు చేశారు. లిటిగేషన్‌ కేసులు తక్కువగా ఉన్న చోట ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయన్నారు. పోలీస్‌ స్టేషన్లు, శాఖల వారీగా కేసులను గుర్తించి సామరస్యంగా పరిష్కరించినట్లయితే ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించిన వారవుతారన్నారు. ఎక్కువ పెండింగ్‌ కేసులున్న చోట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌ ముందుకొచ్చి రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలన్నారు. సాంకేతికత పెరుగుతున్నా కేసుల సంఖ్య, భారం ఎక్కువవుతుందని, చిన్న చిన్న తగాదాలు కూడా కోర్టులకు వస్తున్నాయన్నారు. నీతిగా, నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని, ప్రతికూల పరిస్ధితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలని, మంచి భావన కక్షిదారుల్లో కలిగించాలని సూచించారు. ప్రజల పన్నుల ద్వారా జీతాలు వస్తున్నాయని, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు మనం కడుతున్నామని, పేదవారు పరోక్ష పన్నులు కడుతున్నారన్నారు. సమాజానికి మంచి సేవలు అందించాలని చెప్పారు. లోక్‌ అదాలత్‌ ఆవశ్యకతను సోషల్‌ వర్కర్లు వివరించాలని సూచించారు. రైతులు కష్టపడి పంట పండిస్తేనే ఆహారం లభిస్తుందని, వారిపట్ల ఉదారత చూపించి విరివిగా రుణాలు అందజేయాలన్నారు. లిటిగేషన్‌ కేసులు తక్కువగా ఉండడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కక్షిదారులలో కక్ష, కసి అనేవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీస్‌ అధికారులను, బ్యాంకు అధికారులను పెండింగ్‌ కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి యజ్ఞ నారాయణ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రమేష్‌, అడిషనల్‌ జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ డి.సౌజన్య, బార్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు, ఎస్‌బిఐ చీఫ్‌ మేనేజర్‌ ఎం.రవిశంకర్‌ ప్రసాద్‌, ఎల్‌డిఎం జె.ఎల్‌.ఎన్‌. మూర్తి, పోలీస్‌ అధికారులు, ఎస్‌ఐలు ఎస్‌. షణ్ముఖరావు, ఎం.జగదీష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.