Oct 31,2023 22:58

8న విద్యాసంస్థల బంద్‌

8న విద్యాసంస్థల బంద్‌
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేసే ఆలోచనను మోడీ విరమించుకోవాలని, విభజన హామీల్లో ప్రధానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ 8న విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. తిరుపతి యశోదానగర్‌లోని ఎంబి భవన్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.జయచంద్ర, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.శివారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.మాధవ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కత్తి రవి, పి డి ఎస్‌ ఓ జిల్లా కార్యదర్శి ఆర్‌.ఆశ, పిడిఎస్‌ యూ నాయకులు మహేష్‌ మాట్లాడుతూ లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి అదానీకి అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. కార్మిక ప్రజాసంఘాలు చేస్తున్న పోరాటం నవంబర్‌ 8 నాటికి వెయ్యి రోజులవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే రాయలసీమ జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. నాయకులు ఎం.నరేంద్ర, కె.సుమన్‌, రవి, తేజ, శివ, బండి చలపతి, నవీన్‌, సుందర్‌; రామక్రిష్ణ, సురేష్‌ పాల్గొన్నారు.