Oct 31,2023 19:37

అభివాదం చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈనెల 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కోరారు. మంగళవారం జూనియర్‌ కళాశాల ఆడిటోరియంలో విద్యార్థి, యువజన సంఘం సమావేశం నిర్వహించారు. ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి సభ్యులు మునిస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి మైనా, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీరాములు మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం 32 మంది ప్రాణ త్యాగం చేశారని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు మోడీ ప్రభుత్వం పూనుకోవడాన్ని దారుణమని తెలిపారు. ప్రయివేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న పోరాటం ఈనెల 8 నాటికి వెయ్యి రోజులు అవుతుందని చెప్పారు. వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడంతో పాటు 8న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. లాభాలు వస్తున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరించాలనే ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా ఇనుము గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాది కల్పిస్తున్న విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తే చూస్తూ ఊరుకబోమని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నా ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటయితే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. డివైఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్‌, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, అధ్యక్షులు పోతురాజు, మండల ఉపాధ్యక్షులు గిరి మూర్తి, హరికృష్ణ, మండల సహాయ కార్యదర్శి మహేష్‌, బసవరాజు, ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు అకీరా నందన్‌, జగదీష్‌, ప్రశాంత్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగ, మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్‌, ఎఐవైఎఫ్‌ జిల్లా సభ్యులు రమేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు విక్రమ్‌, ఈశ్వర్‌, నరసింహా, వీరేష్‌, మంజు, రంగస్వామి పాల్గొన్నారు.