Jul 24,2023 22:03

నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురంలో భారీ ఎత్తున పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది నుంచి 8.900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్‌ సిఐ వై.శ్రీనివాసులు, రూరల్‌ అప్‌ గ్రేడ్‌ సిఐ కృష్ణారెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆదివారం రాత్రి శ్రీ సత్యసాయి జిల్లా టూటౌన్‌ స్టేషన్‌ పరిధిలోని భగిరథ సర్కిల్‌ మధుగిరి మారెమ్మ ఆలయ సమీపంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7.400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న హిందూపురం పట్టణానికి చెందిన కళ్యాణ్‌ కుమార్‌, సోమేష్‌, నాగర్జున, అనిల్‌ కుమార్‌, తిరుమలేష్‌, మడకశిర మండలం శివపురం గ్రామానికి చెందిన సురేష్‌, కదిరి ప్రాంతం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన జంపాల సోమశేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కల్యాణ్‌ కుమార్‌, సోమేష్‌, నాగర్జున, అనీల్‌ కుమార్‌, తిరుమలేష్‌, సురేష్‌, సోమశేఖర్‌లు స్నేహితులు. మద్యానికి బానిసైన వీరు హిందూపురం మండలం మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన సురేష్‌ వద్ద గంజాయిని కొని తాగేవారు. సురేష్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో విశాఖపట్నం, అరకుకు వెళ్లి గంజాయిని తెచ్చేవారు. ఈ నెల 19వ తేదీన 8 కిలోల గంజాయిని విశాఖపట్నంకు గోల్గేరి అర్జున్‌, కొంతేటి శ్రీరామ్‌ల నుంచి అరకులో గంజాయిని తీసుకుని హిందూపురానికి వచ్చాడు. ఆదివారం రాత్రి భగిరథ సర్కిల్‌ సమీపంలో కళ్యాణ్‌ కుమార్‌, సోమేష్‌ కుమార్‌లు వారి స్నేహితులైన నాగార్జున, తిరుమలేష్‌, సురేష్‌, అనిల్‌ కుమార్‌, జంపాల సోమశేఖర్‌లను పిలిపించి గంజాయి అమ్మడాని ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఎస్‌ఐ భాస్కర్‌ ప్రసాద్‌ రాజు, తహసీల్దార్‌ హసీనా సుల్తానా, సెబ్‌ సిఐ స్వర్ణలతలతో కలిసి వారిని అదపులోకి తీసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్నా 7.400 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు.
గోళ్లాపురంలో 1.500 కిలోలు స్వాధీనం
హిందూపురం రూరల్‌ మండలం గోళ్లాపురం పారిశ్రామిక వాడలోనూ సోమవారం నాడు ప్రత్యేక బృందాలతో పోలీసులు తనఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయిని తరలిస్తున్న ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా దిగపహండి తాలూకా పుడమరి గ్రామానికి చెందిన నరహరి ప్రధాని కుమారుడు నిలాంచల్‌ను అదపులోకి తీసుకున్నారు. అతని వద్ద 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణ, విక్రయం కేసులో ఇంకొంత మంది నిదింతులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలు
టూటౌన్‌ సిఐ వై శ్రీనివాసులు, రూరల్‌ అప్‌ గ్రేడ్‌ సిఐ కృష్ణా రెడ్డి
గంజాయి విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టూటౌన్‌ సిఐ వై.శ్రీనివాసులు, రూరల్‌ అప్‌ గ్రేడ్‌ సిఐ కృష్ణా రెడ్డిలు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్‌ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని మండలాలు, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గంజాయి వస్తున్నట్లు గుర్తించామన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడరాదన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మకాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.