అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికీ 46 శాతం భూమి సాగవలేదు. 7.33 లక్షల ఎకరాల భూమి బీడుగా ఉంది. సెప్టంబర్ ప్రారంభంలో పడిన వర్షాలతోనైనా ప్రత్యామ్నాయ పంట ద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావించారు. కానీ ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా పెద్దగా పెరగకపోవడం గమనార్హం. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందనే చెప్పాలి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంట సాగు చేసేందుకు వీల్లేకుండా పోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 7.33 లక్షల ఎకరాలు బీడుగా ఉంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 16.15 లక్షల ఎకరాలు సాధారణ సాగు ఉంటుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటికి సాగైంది 8.82 లక్షల ఎకరాల్లోనే. ఇంకా 7.33 లక్షల ఎకరాల భూమి బీడుగా ఉండటం గమనార్హం. మొత్తం సాగు విస్తీర్ణంలో చూసినప్పుడు 54.6 శాతం భూమిలో మాత్రమే విత్తనం పడింది. తక్కిన 46 శాతం భూమి బీడుగానే ఉంది. జిల్లాలల వారీగా చూసినప్పుడు అనంతపురం జిల్లా సాధారణ సాగు భూమి 9.15 లక్షల ఎకరాలయితే సాగైంది 6.22 లక్షల ఎకరాలు. 68 శాతం సాగైంది. సత్యసాయి జిల్లాలో ఏడు లక్షల ఎకరాలు సాధారణ సాగయితే కేవలం 2.60 లక్షల ఎకరాల్లోనే విత్తనం వేశారు. కేవలం 37 శాతం మాత్రమే సాగైంది. ఈ జిల్లాలో మూడొంతుల భూమి బీడుగా ఉంది.
ప్రత్యామ్నాయమూ పెరగలేదు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాధారం కింద అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ పంటయే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాధారణ సాగు 10.79 లక్షల ఎకరాలనుకుంటే విత్తనం వేసింది కేవలం 1.46 లక్షల ఎకరాల్లోనే. 11 శాతంలోపే వేరుశనగ సాగైంది. ఆగస్టులో తీవ్ర వర్షాభావంతో రైతులు విత్తనం విత్తుకోలేకపోయారు. ఇక సెప్టంబర్‌లో పడిన వర్షాలకైనా ప్రత్యామ్నాయ పంటలు సాగవుతాయని ఆశిస్తే ఆ పంటల సాగు కూడా పెద్దగా పెరగలేదు. మొక్కజొన్న, రాగులు, సజ్జ కొంత వరకు మాత్రమే పెరిగాయి. సజ్జ పంట అనంతపురం జిల్లాలో 3528 ఎకరాల్లో సాగైంది. ఇది సాధరణం కంటే కొద్దిగా పెరిగింది. ఇక సత్యసాయి జిల్లాలో రాగులు 2390 ఎకరాల్లో సాగైంది. ఇది కూడా కొద్ది మోతాదులో పెరిగింది. మొక్కజొన్న 35 వేల ఎకరాల్లో సాగైంది. తక్కిన ఏ పంటలు సాధారణ సాగుకుమించి పెరగలేదు.
కొనసాగుతన్న వర్షాభావం
సెప్టంబర్ మొదటి వారంలో కొద్దిగా వర్షాలు పడినప్పటికీ ఆ తరువాత మళ్లీ వర్షాభావ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా సాధారణ వర్షపాతం ఇప్పటికి 251.5 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంది. కాని 186 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. ఇక సత్యసాయి జిల్లాలో 285.5 మిల్లీమీటర్లకుగానూ పడింది 184 మిల్లిమీటర్లు మాత్రమే. ఇది జిల్లా మొత్తంగా చూసినప్పుడు మండలాల వారీగా చూస్తే ఈ వ్యత్యాసాలు మరింత అధికంగానే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 31 మండలాలకకుగానూ 22 మండలాల్లో వర్షాభావం నెలకొంది. సత్యసాయి జిల్లాలో 32 మండలాలకుగానూ 23 మండలాలు వర్షాభావంలోనున్నాయి. అందులో ముదిగుబ్బ, లేపాక్షి, పెనుకొండ, రొద్దం మండలాల్లో 60 శాతం కంటే తక్కువ వర్షపాతం పడింది. సెప్టంబర్ మాసంలోనూ చినుకుజాడలేని మండలాలు కొన్ని ఉండటం గమనార్హం. ఉదాహరణకు రాయదుర్గం మండలంలో సెప్టంబర్ మాసం ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు చూస్తే కేవలం 7.5 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదయింది. ఇది సాధారణంలో 80 శాతం లోటుంది. అదే విధంగా బొమ్మనహళ్‌లో 12 మిల్లీమీటర్లు మాత్రమే సెప్టంబర్‌లో వర్షపాతం నమోదయింది. ఇలా మండలాల వారీగా చూసినప్పుడు అనేక వ్యత్యాసాలున్నాయి.










