Sep 22,2023 15:50

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం : గోశాలలోకి ప్రవేశించి స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఏడు అడుగుల తెల్ల త్రాచుపాము స్నేక్ సేవియర్ సొసైటీ నిర్వాహకులు చదలవాడ క్రాంతి చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం పట్టణంలోని ఏలూరు రోడ్డు జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో నిర్వహిస్తున్న గోశాలలోకి భారీ త్రాచుపాము ప్రవేశించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఈ సమాచారాన్ని స్నేక్ సేవియర్ సొసైటీ నిర్వాహకులు క్రాంతికి తెలియజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న క్రాంతి భారీ సైజులో ఉన్న త్రాచుపాము ను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అధిక సంఖ్యలో స్థానికులు తెల్ల త్రాచు పామును చూడడానికి ఆసక్తి కనపరిచారు. ఈ సందర్భంగా స్నేక్ సేవియర్ సొసైటీ నిర్వాకులు క్రాంతి మాట్లాడుతూ ఇలాంటి తెల్ల త్రాచు పాములు అరుదుగా కనిపిస్తాయని తెలిపారు. వీటిని పట్టి మరల గూడెం అడవి అటవీ ప్రాంతంలో వదలతామని తెలిపారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా తనకు సమాచారం తెలపాలని వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు.