ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లైన్స్‌క్లబ్ సహకారంతో శుక్రవారం స్థానిక వట్లూరులోని సర్ సిఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 65 మంది విద్యార్థులు రక్తదానం చేశారని జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌ఛార్జి కరస్పాండెంట్ కె.హరిరామ కృష్ణం రాజు మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం ప్రతి సంవత్సరం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో 5 రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర సమయాల్లో తమ కళాశాల విద్యార్థులు రక్తదానం చేయడానికి ముందుంటారని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్లేనని, ప్రతి విద్యార్థి రక్తదాతలను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్‌ఎస్‌ఆర్‌కె వరప్రసాదరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, లైన్స్‌క్లబ్ సభ్యులు కె.వేణు బాబు, కె.పద్మావతి, ఎన్‌ఎస్‌ఎస్ పిఒ వి.ప్రణవ్, పిఆర్‌ఒ కెవి.రమణ, తదితరులు పాల్గొన్నారు.










