Oct 02,2023 21:04

జగనన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, అధికారులు

పార్వతీపురంరూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదలందరికీ ఇళ్లు సామూహిక గృహ ప్రవేశాలు ఈనెల 5న జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లలో సామూహిక ప్రారంభోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మండలంలోని కృష్ణపల్లిలో నిర్వహించను న్నారు. ఈ మేరకు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ కృష్ణపల్లి గృహ నిర్మాణ లేఔట్‌ను జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావుతో కలిసి సోమవారం పరిశీలించారు. కృష్ణపల్లి లేఔట్‌లో పూర్తయిన ఇళ్లను, కాలనీ ఆర్చ్‌ నిర్మాణ పనులను, డ్రైనేజీ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సామర్లకోటలో జగనన్న కాలనీ లే అవుట్‌ వద్ద రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఎంపిక చేసిన కాలనీలో పూర్తయిన ఇళ్ల నిర్మాణాలను సమాంతరంగా సామూహిక గృహ ప్రవేశాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణపల్లి కాలనీ లేఔట్‌ లో 124 ఇళ్లు మంజూరు కాగా 60 వరకు నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఆయా గృహాలకు ప్రవేశాలు జరగనున్నాయని వివరించారు. కాలనీ లేఅవుట్‌లో మురుగు కాలువ, ఇతర ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడాన్ని పరిశీలించి నీరు నిల్వ ఉండకుండా ఎప్పటి నీరు అప్పుడే కాలువల ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కాలనీ మ్యాప్‌ ఆధారంగా అవసరమైన మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పించాలన్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకు అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కూలీలతో కాలనీ లే అవుట్‌ వద్ద ఉన్న జంగిల్‌ను శుభ్రపర్చాలని, ప్రవేశ మార్గం వద్ద ఆర్చ్‌ నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. ఆయా శాఖలకు దిశా నిర్దేశం చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సభా స్థలం వద్ద గహ నిర్మాణాల ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాల పూర్తయిన గహ నిర్మాణాల ఛాయాచిత్రాలు ప్రదర్శించాల న్నారు. పరిశీలనలో ఆర్‌డిఒ కె.హేమలత, హౌసింగ్‌ పీడీ టి.రమేష్‌, ఇఇ ఆర్‌ఐవి ప్రసాద్‌ బాబు, ఆర్డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారి ఓ .ప్రభాకర్‌ రావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి జి.మల్లికార్జున, విద్యుత్‌ శాఖ ఎఇ పి.రామారావు తదితరులు పాల్గొన్నారు.