5న బహిరంగ సభను జయప్రదం చేయండి : ఐద్వా
ప్రజాశక్తి - నంద్యాల
హింసపై మహిళల పోరుయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 5న నంద్యాల జిల్లాకేంద్రంలోని గాంధీ చౌక్‌లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి.నిర్మల కోరారు. ఆదివారం నంద్యాలలోని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) కార్యాలయంలో హింసపై మహిళల పోరుయాత్ర గోడ పత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హింసపై మహిళల పోరుయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న చేపట్టిన బస్సు యాత్ర ఆగస్టు 8 వరకు కొనసాగుతుందని తెలిపారు. మహిళలపై హింసకాండ, మధ్య నిషేధం, గంజాయి లాంటివన్నీ నిషేధించాలని డిమాండ్ చేశారు. మహిళలపై తరచూ హింసకాండ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలను పరిపాలించలేకపోతే ఎందుకని ప్రశ్నించారు. మహిళలపై నేరాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ నెల 28న ప్రారంభమైన బస్సు యాత్ర విశాఖపట్నం నుంచి ఒకటి, మరొకటి హిందూపురం నుంచి బయలుదేరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చినా నేరాలు మాత్రం యధావిధిగా జరుగుతూనే ఉన్నాయని అన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని, మహిళల చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 5న గాంధీ చౌక్‌లో జరిగే భారీ బహిరంగ సభకు పట్టణంలోని మహిళలందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు భాను, లక్ష్మి, మధుప్రియ, సుభద్ర, సుకన్య తదితరులు పాల్గొన్నారు.










