Aug 16,2023 21:03

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యాన విశాఖపట్నంలోని స్వర్ణ భారతి ఇండోర్‌ స్టేడియంలో 50వ ఆల్‌ ఇండియా ఇంటర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ -2023 పోటీలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పోటీలకు విచ్చేసిన క్రీడాకారులు విశాఖలోని పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడల్లో ఇది రెండో అతి పెద్ద వేదిక అని, ఎంతోమంది క్రీడాకారులు ఈ క్రీడల్లో ఉత్తమ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు పొందారని తెలిపారు.
టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రటరీ ఎస్‌హెచ్‌ కమలేష్‌ మెహతా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల తరుపున ఈవెంట్స్‌లో మొత్తం 16 పురుషుల జట్లు, 13 మహిళల జట్లు పాల్గొంటాయని తెలిపారు. వ్యక్తిగత ఈవెంట్‌ కోసం ప్రైజ్‌ మనీ రూ.6.5 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న ఈ క్రీడల్లో సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పోటీలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌ రాజారెడ్డి, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ జిఎల్‌ వర్మ, టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోశాధికారి నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.