Aug 11,2023 22:17

విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్‌
ఫ్లోరిడా: నిర్ణయాత్మక మూడో టి20లో నెగ్గిన టీమిండియా సిరీస్‌ రేసులో నిలవాలంటే శనివారం జరిగే నాల్గో టి20లోనూ గెలవాల్సి ఉంది. ఫ్లోరిడా వేదికగా ఇరుజట్ల మధ్య జరిగే నాల్గో టి20లో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని హార్దిక్‌ సేన భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. వరుసగా విఫలమౌతున్న ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌పై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అతడి స్ధానంలో మూడో టి20లో బెంచ్‌కే పరిమితమైన ఇషాన్‌ కిషన్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకురావాలని కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ యోచిస్తున్నారు. శుభ్‌మన్‌ మూడు మ్యాచుల్లో కేవలం 19పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఫ్లోరిడా మైదానం ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలం. ఈ క్రమంలో అదనపు పేసర్‌తో టీమిండియా ఆడాలని భావిస్తే.. స్పిన్నర్‌ చాహల్‌ స్ధానంలో పేసర్‌ అవేష్‌ ఖాన్‌కు తుది జట్టు దక్కే అవకాశముంది. యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ను కొనసాగించే ఛాన్స్‌ ఉంది. ఇప్పటివరకు ఈ వేదికపై 14మ్యాచ్‌లు జరగ్గా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 11సందర్భాల్లో విజయం సాధించాయి.
భారత జట్టు(అంచనా): ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, చాహల్‌/ఆవేశ్‌ ఖాన్‌, ముఖేష్‌ కుమార్‌.