- ప్రొద్దుటూరులో ఐటి దాడులు
- నాలుగు రోజుల పాటు తనిఖీలు
ప్రజాశక్తి-ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్ జిల్లా):వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదాయపన్ను (ఐటి) అధికారులు అనూహ్యమైనరీతిలో చేపట్టిన తనిఖీలు ఆదివారం ముగిశాయి. భారీ మొత్తంలో అక్రమ దిగుమతులు జరుగుతున్నాయన్న సమాచారంతో నాలుగు రోజులుగా పట్టణంలో ఐటి ఈ తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ప్రొద్దుటూరులోని నాలుగు దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 400 కిలోల బంగారాన్ని, 350 కిలోల వెండినీ, రూ.2 కోట్ల వరకూ నగదను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, తిరుపతికి చెందిన ఐటి అధికారులు ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్, గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం భారీ ఎత్తున్న బంగారాన్ని సీజ్ చేసి అట్టపెట్టెలు, సూట్ కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా భారీ ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఐటిశాఖాధికారులు గుర్తించారు. వీటితోపాటు వజ్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. పన్నులు కట్టాల్సిన డబ్బులు సుమారు రూ.170 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 40 మంది అధికారులు 14 కార్ల్లల్లో వచ్చి సోదాలు చేశారు.
బంగారు వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబయిగా ఖ్యాతి గడించింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులో దాదాపు రెండు వేలకుపైగా బంగారం, స్వర్ణకారుల దుకాణాలు ఉన్నాయి. ఐటి అధికారుల తనిఖీలతో మిగతా బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. తనిఖీలు తమ వరకు వస్తాయన్న ఆందోళనతో బంగారం, స్వర్ణకారులు తమ దుకాణాలను మూసివేశారు. దసరా పండుగ సమయంలో బంగారు దుకాణాలన్నీ మూతపడడంతో కొనుగోలుకు వచ్చిన వినియోగదారులు నిరాశ చెందారు.










