ప్రజాశక్తి-నెల్లూరు :డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగంగా స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో పోలీసులు అక్రమంగా గంజాయి రవాణా చేసే ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఎస్‌ఇబి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి వద్ద ఉన్న 40 కేజీల గంజాయి, రూ.95 వేలు నగదు, 5 మొబైల్ ఫోన్స్‌ను సీజ్ చేశారు. బుధవారం నగరంలో నీలగిరి సంఘం ప్రాంతంలోని స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో స్టేషన్-1లో అడిషినల్ ఎస్‌పి డి.హిమవతి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాళెం, కావలి, కలిగిరి పోలీసు స్టేషన్ అధికారులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు, ఎస్‌పి డాక్టరు కె.తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అడిషినల్ ఎస్‌పి డి.హిమవతి పర్యవేక్షణలో ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో సూపరింటెండెంట్ ఎస్.రవికుమార్,అసిస్టెంట్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో సూపరింటెండెంట్ ఎస్ .కృష్ణకృషోర్‌ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో భాగంగా అన్నమయ్య జిల్లా, పుల్లంపేట ప్రాంతానికి చెందిన కె.నాగేంద్ర (ప్రస్తుతం నెల్లూరు జిల్లా గుండవోలు గ్రామం నివాసి), అన్నమయ్య జిల్లా , పుల్లంపేట ప్ర్రాంతానికి చెందిన కె.హరికృష్ణ, పల్లమనేరు, కాకుతోపు ప్రాంతానికి చెందిన షేక్ సలీంబాషా, పూతలపట్టు, బండాపల్లి ప్రాంతానికి చెందిన కె.భాస్కర్, తమిళనాడులోని నమ్మకల్లు జిల్లాకు చెందిన మురుగేషన్‌లను అదుపులోకి తీసు కున్నామన్నారు. వీరి నుంచి 40 కేజీల గంజాయి, రూ.95 వేలు నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.










