ప్రజాశక్తి - తాళ్లరేవు : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీ గోపులంక పుష్కర ఘాట్ వద్ద స్నానానికి దిగి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారి స్నేహితులు తెలిపిన సమాచారం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని సజ్జాపురం గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు యానాం వచ్చారు. అక్కడి నుంచి గోపులంక పుష్కర్ ఘాట్‌లో స్నానానికి దిగారు. గోదావరిలో ఒరవడి అధికంగా ఉండడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగతా వారు కొబ్బరి మట్టల సాయంతో ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారిలో తణుకు ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న తిరుమల రవితేజ, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి పెండ్యాల బాలాజీ, వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ముద్దన ఫణీంద్ర గణేష్, తణుకులో పాలిటెక్నిక్ చదువు మధ్యలో మానేసిన హనుమకొండ కార్తీక్ ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.










