Nov 04,2023 17:05

హైదరాబాద్‌ : మధ్యప్రదేశ్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ను రెబల్స్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలోనే 39 నేతలపై ఆ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి.. ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతోనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బహిష్కరణకు గురైన నేతల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరికొందరు బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) తరఫున పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మాజీ ఎంపీ ప్రేమ్‌చంద్‌ గుడ్డూ, మాజీ ఎమ్మెల్యేలు అంతార్‌ సింగ్‌ దర్బార్‌, యడ్వేంద్ర సింగ్‌, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజరు సింగ్‌ యాదవ్‌, సీనియర్‌ నేతలు నజీర్‌ ఇస్లామ్‌, అమిర్‌ అక్వీల్‌ తదితరులు బహిష్కరణకు గురైన నేతల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి..ఫలితాలు వెల్లడించనున్నారు.