Nov 11,2023 21:38

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
జిల్లాలో 336 ఎండియు (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల ద్వారా 5 లక్షల 41 వేల రేషన్‌ కార్డుదారులకు రేషన్‌ను అందజేయడం జరుగుతున్నదని జిల్లా జాయింట్‌కలెక్టర్‌ పి.శ్రీనివాసులు తెలిపారు. శనివారం విజయవాడ నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌తో కలిసి ఇంటింటికి రేషన్‌ కార్యక్రమంపై అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఎండియు వాహనాల ద్వారా రేషన్‌దారుల వారి ఇంటి వద్దకే రేషన్‌ను అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని, ఈ విషయంలో జిల్లాల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, కావున అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు వారి పరిధిలో ఇంటింటికి రేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఎండియు వాహనాలు ఏ రోజున ఆయా గ్రామాలకు వెళ్ళేది ముందుగా రేషన్‌దారులకు తెలియజేయాలని, రేషన్‌ను వారి ఇంటి వద్దకే వెళ్లి అందించాలని, ఇంటి వద్దకు వెళ్లలేని పరిస్థితులున్న చోట ఏపాయింట్‌ నుంచి రేషన్‌ పంపిణీ చేస్తామనే విషయాన్ని వాలంటీరు ్లసహాయంతో ముందుగా సమాచారం రేషన్‌దారులకు అందించాలన్నారు. ప్రతినెలా రేషన్‌ పంపిణీ పూర్తి అయిన అనంతరం ఎండియు ఆపరేటర్లతో మండల స్థాయిలో సమావేశం నిర్వహించి వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. 2 వేల రేషన్‌కార్డుల కంటే ఎక్కువ రేషన్‌ కార్డులు ఉన్నచోట అదనంగా మరో ఎండియు వాహనం కొరకు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని, రేషన్‌ పంపిణీకి పనికిరాని ఎండియు వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొరకు ప్రతి పాదనలు పంపాలని తెలిపారు. జిల్లాలో ప్రతి నెలా 17వ తేదీ లోపు రేషన్‌ పంపిణీ చేయడం జరుగుతున్నదని జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు వివరించారు. వీడియో కాన్పెరెన్స్‌లో డిఎస్‌ఓ శంకరన్‌, ఏఎస్‌ఓ శేషాద్రి చలం, అధికారులు పాల్గొన్నారు.