30న విజయవాడలో మహాధర్నా
జయప్రదం చేయండి : ఎఐకెఎస్
ప్రజాశక్తి - బేతంచెర్ల
రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న విజయవాడలో జరుగు మహాధర్నాలో రైతులు విస్తతంగా పాల్గొని జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.సుబ్బరాయుడు, ఏ.రాజశేఖర్‌లు కోరారు. శుక్రవారం మండలంలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో మండల స్థాయి విస్తృత సమావేశం వి.సుబ్బరాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.రాజశేఖర్ మాట్లాడుతూ గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో పంటలు వేసి నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆహార పంటలకు ఎకరాకు రూ. 10 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. గత రెండు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న సున్నా వడ్డీ పథకం నగదును రైతుల అకౌంట్లో జమ చేయాలన్నారు. ప్రస్తుతం పావలా వడ్డీ పథకం కింద ఇస్తున్న ఒక లక్ష రూపాయల నుండి రెండు లక్షల రుణం రెండు లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకు 800 రూపాయలు అదనంగా ఇస్తుందని, కర్ణాటక, తమిళనాడు, చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో అదనంగా రైతులకు ఇస్తున్నారని, అలాగే ఎపి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేసి ఆదుకోవాలని కోరారు. అనంతరం ఎపి రైతు సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సీతారాంపురం జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా ఆర్.రామ్మోహన్, ఉపాధ్యక్షుడిగా కె.రామ తిమ్మారెడ్డి, గురుస్వామి, సహాయ కార్యదర్శులుగా టి.పద్మావతమ్మ, సర్వోత్తమ రెడ్డి, పక్కీరయ్య, మండల గౌరవాధ్యక్షుడిగా కృష్ణన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ నాయకులు మాట్లాడుతూ మండలంలోని రైతుల సమస్యలపై ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.










