Oct 25,2023 20:40

గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఈనెల 30న చేపట్టే సిపిఎం 'ప్రజారక్షణ భేరి' బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు గోవిందు, హనుమంతు, డివిజన్‌ నాయకులు రాముడు కోరారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్‌లో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని చెప్పిన పాలక పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. జిల్లా నుంచి రాజకీయంగా అత్యున్నత పదవులు పొంది అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. జిల్లాలో ఒక్క భారీ పరిశ్రమ కూడా లేదని, సాగునీరు, పారిశ్రామిక రంగం, విద్యాభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపారు. జిల్లాలో సహజ వనరులకు కొదవలేదని, పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో అట్టడుగున ఉందని అన్నారు. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురుచూసే లోపు ప్రజల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని, జిల్లా అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం అభివృద్ధి జరగాలంటే నిధులు కేటాయించాలని కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి 'ప్రజా రక్షణ భేరి' పేరుతో ఈనెల 30 నుంచి బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. 30న ఆదోనిలో ప్రారంభమవుతున్న ఈ బస్సు యాత్రకు ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ దావలే, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, రమాదేవి హాజరవుతారని చెప్పారు. 30న ఉదయం 10 గంటలకు ఆదోనిలో పాత బస్టాండ్‌ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. సురేష్‌, అబ్దుల్లా, కృష్ణ, రాజు, రాముడు, రమేష్‌ పాల్గొన్నారు.