Jun 24,2023 18:03

వాల్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్న రైతు సంఘం నాయకులు

30న మహాధర్నా
జయప్రదం చేయండి : రైతు సంఘం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      రైతంగా సమస్యలపై ఈనెల 30న విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగే రైతుల మహాధర్నా కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ.రాజశేఖర్‌, జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు కోరారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన గోరుకల్లు రిజర్వాయర్‌ నాణ్యత లోపం వల్ల కట్ట కుంగిపోయిందని, అలగనూరు ప్రాజెక్టు రైతులకు ఉపయోగం లేకుండా ఉందన్నారు. కొత్తపల్లె, పాములపాడు మండలాల్లో లిఫ్ట్‌ ఇరిగేషన్లు పని చేయడం లేదన్నారు. జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన గోరుకల్లు, అలగనూరు రిజర్వాయర్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న తెలుగు గంగ, ఎస్‌ఆర్బిసి పంట కాలువలను త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టు చివరి భూములకు కూడా సాగునీరు అందించాలని కోరారు. 2022 ఖరీఫ్‌, రబీ సీజన్లలో అధిక, అకాల వర్షాలు, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన ప్రతి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి అవసరమైన అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు పెంచి ఇవ్వాలని కోరారు. సున్నా వడ్డీ, పావలా వడ్డీ ఉన్న పరిమితిని పెంచి బ్యాంకుల ద్వారా రైతులందరికీ రుణాలు ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దళారీల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించేందుకై ప్రభుత్వమే మద్దతు ధరలను అమలు చేసి అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలన్నారు. మండల కేంద్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, జిల్లాలో అరటి రైతులను ఆదుకునేందుకు మహానంది ప్రాంతంలో అరటి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. జాతీయ రహదారులు, సోలార్‌ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాట్ల వల్ల సాగు భూములు కోల్పోతున్న రైతులు, నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి రైతులను, నిరుద్యోగులను ఆదుకోవాలని తదితర సమస్యలను సిఎం దృష్టికి తీసుకువెళ్లేందుకై ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లాలోని రైతులందరూ వేలాదిగా తరలివచ్చి మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్‌, నాయకులు బి.రామరాజు, జి.సుధాకర్‌, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.