30న చలో విజయవాడ
జయప్రదం చేయండి : రైతు సంఘం
ప్రజాశక్తి - పాములపాడు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్నుత్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుండి పోరాట నిర్వహిస్తుందని, ఢిల్లీకి వినిపించేలా ఈ నెల 30న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.రాజశేఖర్ కోరారు. శనివారం పాములపాడులో నాయకులు ఎంసి నారాయణ అధ్యక్షతన రైతు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రాయితీలు ఇవ్వకపోగా ఎరువుల బస్తాల రేట్లు అధికంగా పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వ్యవసాయానికి ఈ ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. రైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు. పండించిన పంటలకు ముందస్తు గిట్టుబాటు ధరను ప్రకటించాలన్నారు. స్థానికంగా ఈ ప్రాంతంలో కెసి కెనాల్ పైభాగంలో ఉన్న మెట్ట ప్రాంతానికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భానుముక్కల గ్రామంలో సిద్దాపురం ఎత్తిపోతల ప్రధాన కాలువ పనులు పూర్తి చేయాలని తదితర సమస్యలపై సచివాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 30న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమానికి రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు బి.రామేశ్వరరావు, వై.నాగేంద్రుడు, మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా కౌలు రైతు సంఘం ఉపాధ్యక్షులు సోమన్న, నాయకులు బాలయేసు, రవణమ్మ, జగన్నాధ రావు, చెన్నయ్య, వెంకటసాయి తదితరులు పాల్గొన్నారు.










