ముంబయి: ఓవైపు ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి.. మరోవైపు హ్యాకింగ్ ఘటనలు కూడా పెరుగుతున్నాయి. 2017లో 100కోట్ల ప్రజలకు చెందిన డేటా లీకైన ఘటన మరువక ముందే... తాజాగా మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది. 30కోట్లకు పైగా ఈ-మెయిల్ ఐడీలు లీకయ్యాయని బ్రిటీష్ వార్తాపత్రిక ది సన్‌లో ఓ కథనం వెలువడింది. ప్రస్తుతం లీకైన ఐడీల్లో నెట్‌ఫ్లిక్స్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయని సమాచారం. ఇందులో మైన్‌క్రాఫ్ట్ బదూ, బిట్‌కాయిన్, పాస్తేబిన్ వినియోగదారులూ ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ హ్యాకింగ్ ద్వారా సుమారు 320 కోట్ల మంది ఈ-మెయిల్ ఐడీ పాస్వర్డ్్లు హ్యాక్‌కు గురయ్యాయి. అయితే ఇందులో మరో కీలక విషయం బయటపడింది. నెట్‌ఫ్లిక్స్, గూగుల్ కోసం ఒకే పాస్‌వర్డ్‌ను ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తుడడంతో బాధితుల సంఖ్య పెరిగినట్లుగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హ్యాక్‌కు గురైన డేటాతో ఇతర ఖాతాలను హ్యాక్ చేయడానికి ఉపయోగపడనుందనేది ఇంకా ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే.. వినియోగదారులు తమ ఖాతా లీక్ అవుతుందనే భయం ఉంటే.. నిపుణుల సలహాల కోసం https://cybernews.com/personal-data-leak-check/ లేదా https://haveibeenpwned.com/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయడం ద్వారా ఈమెయిల్ ఐడీని నమోదు చేసుకుని లీక్ అవుతున్న సమాచారాన్ని తనిఖీ చేసుకునే వీలుంది. పాస్వర్డ్ కనీసం 12 అక్షరాలుగా ఉండాలి. పాస్‌వర్డ్‌లో 123456, 987654321, 123123, 111111 లాంటి నెంబర్లు ఉండకూడదు. అలాగే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వేలిముద్ర, సంజ్ఞల ద్వారా పాస్వర్డ్ చేసుకుంటే మంచిది. ఈ డేటా లీక్‌ను కాంప్లియన్స్ ఆఫ్ మెనీ బ్రీచెస్(సిఒఎంబి) అని పిలుస్తున్నారు.










